దిల్లీ.. దడపుట్టిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా? మైదానం ఏదైనా? తమకు ఎదురేలేదని చాటుతోంది. లీగులో ఐదో విజయం అందుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచులో రాజస్థాన్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన స్మిత్ సేనను 138కే కుప్పకూల్చింది. రాహుల్ తెవాతియా (38), యశస్వీ జైశ్వాల్ (34) ఆ జట్టులో టాప్ స్కోరర్లు. అంతకు ముందు మార్కస్ స్టాయినిస్ (39), హెట్‌మైయిర్ (45) దిల్లీలో అదరగొట్టారు.
దిల్లీ జోరు ముందు కుదేలైన రాజస్థాన్ - ఢిల్లీ స్క్వాడ్ టుడే
షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 184 పరుగుల భారీ స్కోర్ సాధించగా.. రాజస్థాన్ 138 పరుగులకే కుప్పకూలిపోయింది.
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బట్లర్ మరోసారి నిరాశపరుస్తూ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత్ స్మిత్ కాసేపు క్రీజులో ఉన్నా.. 24 పరుగులు చేసి నోకియా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (5), మహిపాల్ లోమ్రోర్ (1) విఫలమయ్యారు. దీంతో 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్. ఓపెనర్‌గా వచ్చి కాసేపు దిల్లీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ 34 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆండ్రూ టై (6) కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ధావన్ (5) వికెట్ కోల్పోయింది. తర్వాత పృథ్వీ షా (19)తో కలిసి శ్రేయస్ అయ్యర్ కాసేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇతడు 22 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత పంత్ (5) విఫల ప్రదర్శన చేశాడు. మిడిలార్డర్లో స్టోయినిస్ (39) హెట్మెయర్ (45) మెరిసిన ఫలితంగా దిల్లీ కాస్త మెరుగైన స్కోర్ చేయలగిలింది. చివర్లో హర్షల్ పటేల్ (16), అక్షర్ పటేల్ (17) ధాటిగా ఆడటం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది దిల్లీ.