ఐపీఎల్ అంపైర్లు వరుసగా విమర్శల పాలవుతున్నారు. దిల్లీ-పంజాబ్ మ్యాచ్‌లో షార్ట్ రన్ ఇవ్వగా, ఇప్పుడు నాటౌట్ను ఔట్‌గా ప్రకటించి వార్తల్లో నిలిచారు. మంగళవారం జరిగిన చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది.
దీపక్ చాహర్ వేసిన బంతి, రాయల్స్ బ్యాట్స్‌మన్ టామ్ కరన్ తొడ ప్యాడ్‌కు తాకి వెనక్కి వెళ్లగా ధోనీ అందుకున్నాడు. చాహర్ అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. టామ్ సమీక్ష కోరాడు కానీ రాజస్థాన్‌కు అప్పటికే అవి అయిపోయాయి. దీంతో అతడు పెవిలియన్ బాటపట్టాడు.
ఈలోపు అంపైర్లిద్దరూ చర్చించుకుని, రివ్యూ తీసుకున్నారు. దీంతో వారికి చెన్నై కెప్టెన్ ధోనీ మధ్య కొంత వివాదం జరిగింది. అంపైర్ క్యాచ్ ఔట్ అన్న ఉద్దేశంతో వేలెత్తినట్లు స్పష్టం కాగా.. అసలు బంతి బ్యాట్‌ను తాకలేదని, ధోనీ అందుకునే ముందు నేలను కూడా తాకిందని వెల్లడైంది. దీంతో టామ్ నాటౌట్ అని ప్రకటించారు. ఇప్పటికే లీగ్‌లో అంపైరింగ్‌పై విమర్శలొస్తుండగా.. తాజా వివాదంతో అవి మరింత పెరిగాయి.
దిల్లీ, పంజాబ్ మ్యాచ్‌లోనూ
ఆదివారం జరిగిన పంజాబ్, దిల్లీ మ్యాచ్‌లోనూ అంపైర్ నితిన్ మేనన్ తప్పిదం వల్లే పంజాబ్ ఓడిపోయిందని ఆ జట్టు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛేదనలో పంజాబ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ 19వ ఓవర్లో షాట్ కొట్టి.. రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న క్రిస్ జోర్దాన్ సింగిల్ పూర్తి చేసే క్రమంలో కీపర్ ఎండ్‌వైపు క్రీజులో సరిగ్గా బ్యాట్ పెట్టలేదని తేల్చిన స్వ్కేర్ లెగ్ అంపైర్ నితిన్ మేనన్.. 'షార్ట్ రన్'గా ప్రకటించి పరుగు మాత్రమే ఇచ్చాడు. మాజీ క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు పలువురు అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పోస్టులు పెట్టారు.