'బ్రేక్ టైంలో వీళ్లేం తాగారో కనుక్కోవయ్యా. కాస్త మనవాళ్లకు కూడా పడదాం'- సై సినిమాలో భయపెట్టిన భిక్షూ యాదవ్ జట్టుపై నితిన్ టీం వరుసగా పాయింట్లు చేస్తుంటే పోలీసు అధికారి చెప్పిన డైలాగ్ ఇది. ఐపీఎల్‌లో పంజాబ్ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. తొలి అర్ధభాగంలో వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయిన అదే జట్టు.. మలి అర్ధభాగంలో వరుసగా ఐదు మ్యాచులు గెలిచి సంచలనం సృష్టించింది. ప్లేఆఫ్స్ అవకాశాలను ఒడిసిపట్టింది. మరి ఇంతకీ రాహుల్ సేన ఇంటర్వెల్‌లో ఏం చేసిందో తెలుసా!
విమర్శల్ని లెక్కచేయలేదు
'టీమ్ ఇండియాకు భవిష్యత్తు కెప్టెన్ దొరికాడు'.. పంజాబ్‌కు కేఎల్ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేసినప్పుడు, టీ20 లీగ్‌కు ముందు విశ్లేషణలు. 'రాహుల్ సైతం కోహ్లీ బాటలోనే నడుస్తున్నాడు. అతడికి నిజమైన వారసుడు ఇతడే మరి' వరుసగా ఐదు ఓటములు ఎదురవ్వడంతో వెటకారంతో వచ్చిన విమర్శలివి.
'కేఎల్ రాహుల్ జట్టును గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. సమయోచితంగా బౌలింగ్, ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తున్నాడు. హైదరాబాద్ మ్యాచులో 19వ ఓవర్లో జోర్డాన్‌ను ఉపయోగించడమే అందుకు ఉదాహరణ. అందుకే వారిప్పుడు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నారు' వరుస విజయాల తర్వాత సన్నీ గావస్కర్ ప్రశంసలు.
ఇవన్నీ చెప్పొదొక్కటే.. పంజాబ్ అంటే రాహుల్.. రాహుల్ అంటే పంజాబ్ అని. అతడు రాణించినా.. రాణించకపోయినా ఆ జట్టుకు అతడే బలం.. అతడే బలహీనత. కానీ ఇప్పుడా బలహీన పరిస్థితి మారింది. జట్టులో సమష్టితత్వం పెరిగింది. ఆఖరి బంతి వరకు పోరాడుతోంది. విజయాల పరంపర కొనసాగిస్తోంది.
మూమెంట్స్ గెలవలేదు
తొలి అర్ధభాగంలో నిజానికి పంజాబ్ కనీసం 4 మ్యాచులు గెలవాల్సింది. కానీ చిన్న చిన్న మూమెంట్స్‌ను ఒడిసిపట్టడంలో విఫలమై ఓటమి పాలైంది. దిల్లీతో తొలి మ్యాచ్‌ను చివరిదాకా తీసుకొచ్చారు. అప్పటి వరకు అజేయంగా నిలిచిన మయాంక్ (89; 60 బంతుల్లో) ఆఖరి ఓవర్లో ఔటవ్వడంతో మ్యాచ్ సూపర్‌ఓవర్‌కు దారితీసింది. ఆపై విజయం దూరమైంది.
షార్జాలో రాజస్థాన్‌కు 224 పరుగుల లక్ష్యం నిర్దేశించినా బౌలింగ్‌లో పసలేకపోవడం.. సమయోచితంగా వికెట్లు తీయకపోవడంతో ఓటమి పాలవ్వక తప్పలేదు. నిజానికి ఇందులో గెలవాల్సింది.
ముంబయి మ్యాచులో 16 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా బంతులేసిన బౌలర్లు చివరి 4 ఓవర్లలో 67 పరుగులిచ్చేశారు. మిడిలార్డర్ కుప్పకూలడంతో ముందున్న లక్ష్యం ఛేదించిలేకపోయింది.
చెన్నై మ్యాచులో బౌలర్లు కనీసం వికెట్ తీయలేకపోయారు. హైదరాబాద్‌పై బౌలర్లు, బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్‌కతా పోరులో ఆఖరి 5 బంతుల్లో 12 చేయలేక విలవిల్లాడారు. ఇవన్నీ ఆయా మ్యాచుల్లో కీలకమైన మూమెంట్స్. వీటిని గెలవలేక మ్యాచులను చేజార్చుకుంది. రెండో అర్ధభాగంలో వాటిని సరిచేసుకుంది.
సుడి'గేల్' అదృష్టం
పంజాబ్ ఆడిన తొలి 7 మ్యాచుల్లో క్రిస్‌గేల్ ఆడలేదు. ఎందుకాడించడం లేదని అడిగినా సరైన సమయంలో ఆడిస్తామన్నారు. ఎప్పుడైతే అతడు జట్టులోకి వచ్చాడో అప్పట్నుంచి నుంచి వారి దశ, అదృష్టం మారింది. జట్టు విజయాల బాట పట్టింది. అతడు 5 మ్యాచుల్లో 2 అర్ధశతకాలతో 177 పరుగులు చేశాడు. అతడి మెరుపు షాట్లతోనే బ్యాటింగ్ ఆర్డర్‌పై భారం తగ్గింది.
జట్టు సారథి కేఎల్ రాహుల్ (529; 12 మ్యాచుల్లో) తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ (398; 10 మ్యాచుల్లో) సైతం మంచి టచ్‌లో కనిపించాడు. నికోలస్ పూరన్ (329; 12 మ్యాచుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటం మొదలెట్టేశాడు. ఇప్పుడు మన్‌దీప్‌సింగ్ సైతం ఫామ్ అందుకున్నాడు. ఒక్క మాక్స్‌వెల్ మాత్రమే భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నాడు. అతడు మెరుపు షాట్లతో అలరించకపోయినా వికెట్ పడకుండా మిగతా వాళ్లకు స్ట్రైక్ ఇస్తూ జట్టు విజయాలకు దోహద పడటం మాత్రం గొప్పే.