దిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది . తొలుత బ్యాట్‌తో.. తర్వాత బంతితో ఆధిపత్యం చెలాయించి బెంగళూరును చిత్తుగా ఓడించింది. దుబాయ్ వేదికగా కోహ్లీసేనతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ.. మార్కస్ స్టాయినిస్ (53*; 26 బంతుల్లో, 6×4, 2×6) అజేయ అర్ధశతకంతో మెరవడం వల్ల 196 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ జట్టులో కోహ్లీ (43; 39 బంతుల్లో 2×4, 1×1) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీపై దిల్లీ ఘనవిజయం - ఢిల్లీ స్క్వాడ్ టుడే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 59 పరుగులు తేడాతో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మ్యాచ్‌లో మొదటి నుంచి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసుకున్న దిల్లీ జట్టు.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచే పృథ్వీ షా (42; 23 బంతుల్లో, 5×4, 2×6) బౌండరీల మోతతో దిల్లీకి శుభారంభం లభించింది. అతడికి తోడుగా శిఖర్ ధావన్ (32; 28 బంతుల్లో, 3×4) కూడా మెరవడం వల్ల పవర్‌ప్లేలో ఆ జట్టు 63 పరుగులు సాధించింది. అయితే 7వ ఓవర్‌లో పృథ్వీ షాను సిరాజ్ బోల్తా కొట్టించి దిల్లీ పరుగుల జోరుకు బ్రేక్ వేశాడు. కొద్దిసేపటికే ధావన్, శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఔటవ్వడం వల్ల స్కోరుబోర్డు నెమ్మదించింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ (37; 25 బంతుల్లో, 3×4, 2×6), స్టాయినిస్ మరో వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడటంతో 13వ ఓవర్‌లో దిల్లీ స్కోరు 100 పరుగులు దాటింది. అనంతరం మార్కస్ స్టాయినిస్ (53*; 26 బంతుల్లో, 6×4, 2×6) బౌండరీల మోత మోగించాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్.. సైని ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. పంత్ కూడా చెలరేగడం వల్ల పరుగులు పోటెత్తాయి. ఈ క్రమంలో స్టాయినిస్ 24 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఆఖరి ఓవర్‌లో హెట్‌మెయిర్ (11*) సిక్సర్‌తో దిల్లీ స్కోరు 196 పరుగులకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ సైని విఫలమయ్యాడు. 3 ఓవర్లు వేసి 48 పరుగులు సమర్పించుకున్నాడు.