ఇప్పటివరకు ఐపీఎల్ 12 సీజన్లు పూర్తయినా ట్రోఫీ దక్కించుకోవడంలో మాత్రం విఫలమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. స్టార్ ఆటగాళ్లు ఉన్నా అంచనాలు అందుకోవడంలో మాత్రం విఫలమైంది. అయితే ఈసారి పక్కా వ్యూహాలతో బరిలో దిగిన బెంగళూరు టైటిల్ వేటలో శ్రమిస్తోంది. అందులో భాగంగా యువ ఆటగాళ్లకు సీనియర్ ఆటగాళ్లను మార్గదర్శకులుగా నియమించి యువకుల నుంచి మంచి ప్రదర్శన రాబడుతోంది. తాజాగా దీనిపై ఈ జట్టు డైరెక్టర్ మైక్ హెసన్ స్పష్టతనిచ్చాడు.
"మెంటార్‌షిప్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని కోచ్ సైమన్ కటిచ్ అనుకున్నారు. ఎందుకంటే చాలా క్రీడల్లో ఇలా జరుగుతోంది. సీనియర్లు తమ అనుభవాన్ని జూనియర్లతో పంచుకొనే అవకాశం కలుగుతుంది. కుర్రాళ్ల సమస్యలు, సందేహాలను వారు తీర్చగలరు. వారు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. స్టెయిన్ ఎంత గొప్ప బౌలరో అందరికీ తెలుసు. వేగంగా బంతులు విసిరే సత్తా ఉన్న కుర్రాడు సైనీ ఎదగాలని కోరుకుంటున్నాడు. అందుకే అతడిని స్టెయిన్ చేతుల్లో పెట్టాం. దూకుడుగా ఆడగలిగే యువ ఓపెనర్ పడిక్కల్‌కు కోహ్లీని మించిన మార్గనిర్దేశకుడు ఎవరు దొరుకుతారు? వారిద్దరూ విజయవంతం అవ్వాలనే కోరుకుంటారు. అందుకే జత కలిపాం. మిగతా సీనియర్లకూ జూనియర్లను అప్పగించాం."