అబుదాబి వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజృంభించింది. 186 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.
రాజస్థాన్ గెలుపులో బెన్ స్టోక్స్ (50; 26 బంతుల్లో, 6×4, 3×6) కీలక పాత్ర పోషించాడు. అతడిపై ప్రశంసలు కురిపించాడు ఆ జట్టు సారథి స్టీవ్ స్మిత్. బట్లర్‌ను ఐదో స్థానంలో పంపించడం వల్ల నెట్ రన్‌రేట్ పెరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు.
"ఈ టోర్నమెట్లో మేం మునిగాం, తేలాం. గత మ్యాచ్‌లో ఆడలేదు గనుక ఈసారి బట్లర్‌ను ఐదో స్థానంలో పంపించాలి అనుకున్నాం. అది మాకు నెట్ రన్‌రేట్‌ను సాధించడంలో చాలా ఉపయోగపడింది. గత రెండు మ్యాచ్‌ల నుంచి స్టోక్స్ విజృంభిస్తున్నాడు. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లలో స్టోక్స్ ఒకడు. అతడు మిడిల్లో ఆడితే బాగా ప్రదర్శిస్తాడని మాకు తెలుసు. రానున్న మ్యాచుల్లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తాం."
--- స్టీవ్ స్మిత్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్.
బౌండరీకి పంపిస్తే...
రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాడు ఓపెనర్ స్టోక్స్. 24 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసి, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. "సిక్స్‌లు బాదడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను ముంబయితో అనుసరించిన వ్యూహంతోనే ఈరోజు బరిలోకి దిగాను. కొత్త బంతితో బాగా ఆడాలని అనుకున్నాను. గత మ్యాచ్ నుంచి మాకు మేము చక్కగా ఆడుతున్నాం. బంతిని బౌండరీకి పంపిస్తే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది" అన్నాడు స్టోక్స్.