ఎదురుగా కొండంత లక్ష్యం.. అంతగా అనుభవం లేని ఓ కుర్రాడు క్రీజులోకి వచ్చాడు. ఒత్తిడితో బంతికి బ్యాట్‌ను కూడా తాకించలేక అవస్థలు పడ్డాడు. అందరి దృష్టిలో విలన్‌గా మారిపోయాడు. హిట్టర్ ఉతప్పను కాదని అతడిని ముందుగా బ్యాటింగ్‌కు పంపించిన స్మిత్ నిర్ణయంపై అభిమానులంతా అసహనానికి గురయ్యారు. అయితే అదంతా కొద్దిసేపే. తర్వాతే అసలు కథ మొదలైంది. వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. అతడి విధ్వంసం చూసి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అంతే.. ఒక్కసారిగా విలన్ హీరోగా మారిపోయాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాతియా. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో జీరో నుంచి హీరోగా మారిపోయాడు. మాజీలు, ప్రముఖులు, అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇతడి ప్రదర్శన గురించి తన ఫ్యామిలీ ఏమంటుందో చూద్దాం.
"నా కొడుకు ఇంత బాగా ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి రాహుల్ చాలా కష్టపడ్డాడు. తను మొదట్లో బంతిని ఆడేటపుడు ఇబ్బంది పడ్డ సమయంలో ఇంట్లో మేము చాలా ఒత్తిడికి గురయ్యాం. కానీ చివర్లో అతడి ప్రదర్శనతో అందరం ఎగిరి గంతేశాం. రాహుల్ టీమ్ఇండియాకు ఆడితే చూడాలని ఉంది" అంటూ రాహుల్ తల్లి ప్రేమ్ తెవాతియా తెలిపారు.
చిన్నప్పట్నుంటి క్రికెట్ అంటే ఇష్టం
రాహుల్ తెవాతియా హరియాణాలోని ఫరిదాబాద్ జిల్లాలోని సిహి అనే గ్రామంలో 1993లో జన్మించాడు. అతడి తండ్రి కృష్ణ పాల్ లాయర్‌గా పనిచేస్తున్నారు. అయితే తెవాతియా ఆటల్లోకి రావడానికి ప్రధాన కారణం తన తాతయ్య, మామయ్య. అతడి తాతయ్య వ్యవసాయంతో పాటు కుస్తీల్లో పాల్గొనేవారు. దీంతో మనవడ్ని పహిల్వాన్ చేయాలనుకున్నాడు. అతడి మామయ్య హాకీ ప్లేయర్, దీంతో అల్లుడ్ని హాకీ ఆడించాలనుకున్నాడు. కానీ తెవాతియా మాత్రం క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులో అతడిని కృషన్ పాల్.. విజయ్ యాదవ్ క్రికెట్ అకాడమీలో చేర్చారు. విజయ్ యాదవ్ దగ్గరే తెవాతియా క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. భారత మాజీ వికెట్‌కీపర్ విజయ్ యాదవ్ క్రికెట్ అభిమానులకి సుపరిచితమే.
రంజీల్లో అరంగేట్రం