కమలేశ్ నాగర్‌కోటి, శివమ్ మావి.. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సులువైన విజయాన్ని అందించిన యువ పేసర్లు. 2018 అండర్-19 ప్రపంచకప్‌ను యువ భారత్ గెలుచుకోవడంలో ఈ ఇద్దరిది కీలకపాత్ర. ఆ తర్వాత అప్పుడప్పుడు శివం మావి పేరు వినిపించినా.. నాగర్‌కోటి ఎక్కడా కనిపించలేదు. కారణం గాయాలే. కెరీర్ ప్రమాదకర గాయాలతో ఆటకు దూరమయ్యారు. ప్రస్తుతం ఫిట్‌గా కనిపిస్తున్న వీరు పదునైన పేస్‌తో అందరి దృష్టిలో పడ్డారు. వీరు కోలుకోవడానికి బీసీసీఐ దాదాపుగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేసిందట.
ఆ ఇద్దరు క్రికెటర్లు కోలుకోవడానికి కోటిన్నర ఖర్చు
గత కొంతకాలంగా గాయలతో బాధపడుతున్న భారత యువ పేసర్లు నాగర్‌కోటి, మావి కోలుకునేందుకు దాదాపు కోటిన్నర రూపాయలను ఖర్చు పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది.
"ఆ ప్రపంచకప్ తర్వాత నాగర్‌కోటి వెన్నునొప్పి, చీలమండ గాయంతో బాధపడ్డాడు. దీంతో అతణ్ని యూకే తీసుకెళ్లిన బీసీసీఐ.. అక్కడి వైద్య నిపుణుల సాయం కోరింది. అతను ఎన్‌సీఏలో దాదాపు ఏడాదిన్నర పాటు ఉండి కోలుకున్నాడు. మరోవైపు మావి మోకాలి గాయం నుంచి బయటపడేందుకు ఎన్‌సీఏలో ఎనిమిది నెలలున్నాడు. నాగర్‌కోటి కంటే త్వరగానే అతను కోలుకున్నప్పటికీ గత దేశవాళీ సీజన్‌లో మరోసారి గాయపడ్డాడు. వీళ్లు పూర్తిగా కోలుకుని, తిరిగి మైదానంలో అడుగుపెట్టడం కోసం బీసీసీఐ సుమారు రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టింది" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.