తెలంగాణ

telangana

ETV Bharat / sports

దంచికొట్టిన హిట్​మ్యాన్​.. కోల్​కతాపై ముంబయి బోణీ - ఐపీఎల్​ 2020 లైవ్​ అప్​డేట్స్​

కోల్​కతా నైట్​ రైడర్స్​పై ముంబయి ఇండియన్స్​ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్​కతా.. 146కే పరిమితమైంది. బౌలర్లలో ట్రెంట్​ బోల్ట్​, ప్యాటిన్​సన్​, బుమ్రా, రాహుల్​ చాహర్​లు రెండేసి వికెట్లు తీశారు. ముంబయి జట్టు విజయంలో సారథి రోహిత్‌ శర్మ (80), సూర్యకుమార్​ యాదవ్​(47) కీలక పాత్ర పోషించారు.

munbai
ముంబయి

By

Published : Sep 24, 2020, 12:21 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఐపీఎల్​ ఆరంభ మ్యాచ్​లో చెన్నై జట్టుపై ఓటమి పాలైన ముంబయి ఇండియన్స్..​ అబుదాబిలో జరిగిన తన రెండో మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​పై 49పరుగులు తేడాతో విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా.. నిర్ణిత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. దినేశ్​ కార్తిక్​(30) నితీశ్​ రాణా(24) జట్టును గెలిపించడానికి విఫలయత్నం చేశారు. చివర్లో కమిన్స్‌ (33, 12 బంతుల్లో; 1×4, 4×6) విరుచుకుపడ్డా.. అప్పటికే మ్యాచ్​ చేజారిపోయింది. ముంబయి బౌలర్లలో ట్రెంట్​ బోల్ట్​(2), జేమ్స్​ ప్యాటిన్​సన్​(2), జస్ప్రిత్​ బుమ్రా(2), రాహుల్​ చాహర్​(2), కీరన్​ పొలార్డ్​ (1) వికెట్​ తీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది ముంబయి. హిట్​మ్యాన్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు లభించింది.

రోహిత్​ ధనాధన్​..

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగింది ముంబయి జట్టు. సారథి రోహిత్‌ శర్మ(80, 54 బంతుల్లో; 3×4, 6×6) అర్ధశతకంతో చెలరేగాడు. సూర్యకుమార్​ యాదవ్​(47) ముంబయి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది ముంబయి.

ఇన్నింగ్స్‌ ఆదిలోనే రోహిత్‌సేనకు ఎదురుదెబ్బ తగిలింది. డికాక్‌ (1)ను శివమ్‌ మావి (2/32) పెవిలియన్‌కు చేర్చి ముంబయికి షాక్‌ ఇచ్చాడు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (47, 28 బంతుల్లో; 6×4, 1×6)తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 90 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11వ ఓవర్‌లో జట్టు స్కోరు 98 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌటయ్యాడు. తర్వాత సౌరభ్‌ (21, 13 బంతుల్లో; 1×4, 1×6)తో కలిసి హిట్‌మ్యాన్‌ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.

అయితే భారీ షాట్‌కు యత్నించి నరైన్‌ బౌలింగ్‌లో (1/22) సౌరభ్‌ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ (18, 13 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి హిట్‌మ్యాన్‌ మరింత దూకుడుగా ఆడాడు. పుల్‌షాట్లు, భారీ సిక్సర్లతో అలరించాడు. అతడికి తోడుగా హార్దిక్‌ కూడా మెరవడం వల్ల ముంబయి 220 పరుగులు చేస్తుందని భావించారంతా. కానీ శివమ్‌ మావి, రసెల్‌ వేసిన వరుస ఓవర్లలో రోహిత్‌, హార్దిక్‌ పెవిలియన్‌కు చేరడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (13*)‌, కృనాల్‌ (1) ఆశించిన స్థాయిలో బ్యాట్‌ ఝుళిపించకపోవడంతో ముంబయి 195 పరుగులకే పరిమితమైంది.

తేలిపోయిన కమిన్స్‌...

వేలంలో కోల్‌కతా రికార్డు స్థాయిలో భారీ మొత్తానికి సొంతం చేసుకున్న కమిన్స్‌ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. మూడు ఓవర్లలో ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో రోహిత్‌ రెండు సిక్సర్లు, సౌరభ్‌ ఫోర్‌, సిక్సర్‌, హార్దిక్‌ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదారు. బ్యాటింగ్​లో మాత్రం చివర్లో కమిన్స్‌ సిక్సర్లతో చెలరేగడం వల్ల కోల్‌కతా ఓటమి అంతరాన్ని తగ్గించుకుంది.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details