తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన ముంబయి.. చిత్తుగా ఓడిన కోల్​కతా - ఐపీఎల్​ 13 అప్​డేట్స్​

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​పై​ ముంబయి ఇండియన్స్​ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి 16.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విజయంలో డికాక్​(78), రోహిత్ శర్మ(35) కీలక పాత్ర పోషించారు.

MUMBAI INDIANS
ముంబయి

By

Published : Oct 16, 2020, 11:06 PM IST

Updated : Oct 16, 2020, 11:22 PM IST

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ మరోసారి ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. కోల్​కతా నైట్​ రైడర్స్​ను చిత్తుగా ఓడించి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి 16.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విజయంలో డికాక్​(78), రోహిత్(35)​ కీలక పాత్ర పోషించారు. హార్దిక పాండ్య, సూర్యకుమార్​ యాదవ్​ పర్వాలేదనిపించారు.

అంతకముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ముంబయి బౌలర్ల ధాటికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడారు. బౌల్ట్‌, కౌల్టర్‌నైల్ ఆదిలోనే ఆ జట్టు దెబ్బ తీశారు. దీంతో పవర్‌ప్లేలో 33 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం రాహుల్ చాహర్‌ (2/18) వరుస బంతుల్లో గిల్‌ (21, 23 బంతుల్లో; 2×4), దినేశ్‌ కార్తీక్‌ (4; 8 బంతుల్లో; 1×4)ను పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్‌ (12; 9 బంతుల్లో, 1×4, 1×6)ను బుమ్రా బోల్తా కొట్టించడం వల్ల 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కమిన్స్‌(53).. మోర్గాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. 87 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కౌల్టర్‌నైల్‌ వేసిన 13వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. బౌల్ట్‌ వేసిన 19వ ఓవర్‌లో ఫోర్‌, సిక్సర్‌ బాది స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న మోర్గాన్ (39*; 29 బంతుల్లో, 2×4, 2×6) రెండు సిక్సర్లు బాదడం వల్ల ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు లభించాయి. ముంబయి బౌలరల్లో రాహుల్ చాహర్ రెండు వికెట్లు, బౌల్ట్, కౌటర్‌నైల్, బుమ్రా తలో వికెట్ తీశారు.

Last Updated : Oct 16, 2020, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details