ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ధోనీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన టీమ్ఇండియా మాజీ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ సయ్యద్ కిర్మాణీ.. విమర్శించే వారిపై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. వారిని చూస్తుంటే జాలి వేస్తుందని అన్నాడు. టీమ్ఇండియాకు మహీ అందించిన సేవలను ఎన్నటికీ మర్చిపోకూడదని గుర్తు చేశాడు.
"కెరీర్లో ప్రతి ఆటగాడు ఒకానొక సమయంలో ఎలా విజృంభిస్తాడో అలానే పేలవమైన ప్రదర్శన చేస్తాడు. కాలంతో పాటు పరిస్థితులు మారుతుంటాయి. అన్ని రోజులు ఓకేలా ఉండవు. ధోనీ పరిస్థితి కూడా అంతే. ఓ గొప్ప ఆటగాడి ప్రదర్శన కొంచెం తగ్గినంత మాత్రాన విమర్శించడం సరికాదు. విమర్శలు చేసేవారిని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. ధోనీ విజయాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అతడు ఉత్తమమైన ఫినిషర్. చాలా కాలం తర్వాత మళ్లీ బ్యాట్ పట్టుకోవడం ఈ ఐపీఎల్లో అతడి ప్రదర్శన కొంచెం తగ్గింది. యువ ఆటగాళ్లతో పోలిస్తే వయసు పైబడిన క్రికెటర్ల ఆటతీరు కొంచెం పట్టు తగ్గడం సహజం. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచనలతో వారు సతమతమవుతుంటారు. ఇంకా అనేక సమస్యలుంటాయి. ఇవి మీకు తెలియదు. కాబట్టి మనమందరం వారి పరిస్థితిని తప్పుపట్టకూడదు, అంగీకరించాలి"