ఈ ఏడాది ఐపీఎల్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్. లీగ్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ విషయంపై భారత మాజీ బ్యాట్స్‌మన్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఇప్పటివరకు అత్యుత్తమ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలుస్తూ వచ్చిన చెన్నై.. ఇలా డీలా పడిపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. టాపార్డర్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రాకపోవడం జట్టుకు ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు. అలాగే జట్టులో ఐదుగురు బౌలర్లు మాత్రమే ఉండటాన్ని ధోనీ ఎప్పుడూ ఇష్టపడడని అన్నాడు.
"నాకు గుర్తున్నంతవరకు ధోనీ ఎప్పుడూ ఐదుగురు బౌలర్లతో ఐపీఎల్ బరిలోకి దిగలేదు. ఇదే తొలిసారి. ఆ విధంగా చేయడం మహీకి కూడా ఇష్టం లేదు. తన బ్యాటింగ్ గురించి కొంత ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. రాయుడు లేకపోవడం జట్టుకు పెద్ద లోపం. దీంతో పాటు మురళీ విజయ్ సరిగ్గా ఆడకపోవడం, రుతురాజ్‌ను చేర్చుకోవడం అంతా గందరగోళాన్ని సృష్టించింది. ఈ సీజన్లో జడేజా బౌలింగ్ గమనించినట్లైతే.. వేసే 4 ఓవర్లకు 40కిపైగా స్కోరు ఇస్తున్నాడు. అలా ఎక్కువ పరుగులు ఇస్తే జట్టుకు ఉచ్చు బిగించుకున్నట్లే."