బయోబబుల్ వాతావరణంలో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా ఆటగాళ్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడి ఐపీఎల్ కోసం ఇటీవల దుబాయ్ చేరుకున్నారు. అక్కడ కూడా 36 గంటలపాటు క్వారంటైన్లో ఉండి బయోబుడగలోకి అడుగుపెట్టారు. అయితే మ్యాచ్ కోసం వెళ్లిన ప్రతిచోట ఈ బుడగలోకి అడుగుపెట్టడం ఓ పెద్ద సవాల్ లాంటిదని అభిప్రాయపడ్డాడు సన్రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్. ముఖ్యంగా కుటుంబ సభ్యులు తనతో లేకపోవడం చాలా భారంగా అనిపిస్తోందని చెప్పాడు.
"బయో బబుల్ వాతావరణం ఓ పెద్ద సవాల్ లాంటిది. రాబోయే కొన్ని నెలలపాటు ఇలానే కొనసాగుతుంది. కుటుంబసభ్యులతో కలిసి గడపలేకపోవడం చాలా బాధాకరం. కరోనా కారణంగా ఇది తప్పదు. ఏదేమైనప్పటికీ బీసీసీఐ, ఫ్రాంచైజీ నిర్వాహకులు మంచి నిర్ణయమే తీసుకున్నారు."