ఐపీఎల్లో ఆదివారం ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. చివరికి వార్నర్‌సేనపై 34 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ జట్టు.. ఇన్నింగ్స్‌ను చక్కగా ఆరంభించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(60) హాఫ్‌సెంచరీతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కానీ, ఆ తర్వాత జేమ్స్ పాటిన్సన్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్‌మెన్‌పై ముంబయి బౌలర్లు ఆధిపత్యం సాధించారు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 రన్స్ చేసి పరాజయాన్ని మూట కట్టుకుంది. టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండింట్లో ఓడి, 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ముంబయి జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ముంబయి సమష్టి కృషి.. సన్‌రైజర్స్ ఓటమి - హైదరాబాద్ Vs ముంబయి 2020 డ్రీమ్ఎలెవన్ టీమ్
ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌సేనపై 34 పరుగుల తేడాతో ముంబయి జట్టు గెలుపొందింది. ఛేదనలో హైదరాబాద్ దూకుడుగా ఆడినా.. ముంబయి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను అడ్డుకోవడంలో విజయం సాధించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ముంబయి జట్టుకు శుభారంభం లభించలేదు. సిక్సర్ బాది ఖాతా తెరిచిన రోహిత్‌శర్మ (6; 5 బంతుల్లో, 1×6) తొలి ఓవర్‌లోనే సందీప్ శర్మ (2/41) బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చి వేగంగా బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ (27; 18 బంతుల్లో, 6×4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో ఇషాన్ కిషన్ (31; 23 బంతుల్లో, 1×4, 2×6)తో కలిసి క్వింటన్ డికాక్ (67; 39 బంతుల్లో, 4×4, 4×6) అర్ధశతకంతో అదరగొట్టి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. తొలుత వీరిద్దరు మరో వికెట్ పడకుండా నిదానంగా ఆడిన తర్వాత గేర్ మార్చి పరుగులు సాధించారు. ఈ క్రమంలో డికాక్ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడే ప్రయత్నంలో అతడు రషీద్ ఖాన్ (1/22)కు రిటర్న్‌క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్దిసేపటికే ఇషాన్ ఔటయ్యాడు.
అనంతరం బ్యాటింగ్ వచ్చిన హిట్లర్లు హార్దిక్ పాండ్యా (28; 19 బంతుల్లో, 2×4, 2×6), పొలార్డ్ (25*, 13 బంతుల్లో; 3×6) బౌండరీలతో అలరించారు. రషీద్ ఖాన్ బంతుల్ని జాగ్రత్తగా ఎదుర్కొన్న పొలార్డ్ తర్వాత భారీషాట్లు ఆడాడు. సందీప్ వేసిన 17వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, తర్వాతి ఓవర్‌లో ఒక సిక్సర్ బాదాడు. అయితే ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్ల ముంబయి 208 పరుగులు చేసింది. అతడు నాలుగు బంతుల్లో 20 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ చెరో రెండు వికెట్లు తీయగా, రషీద్ ఒక్క వికెట్ పడగొట్టాడు. నటరాజన్ వికెట్లు సాధించకపోయినా ముంబయి స్కోరును కట్టడి చేశాడు. కౌల్ (2/64) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.