తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరుసగా నాలుగో విజయం.. అగ్రస్థానంలో ముంబయి - mi vs dc

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న రోహిత్​సేన.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

MI vs DC: Mumbai Indians beat Delhi Capitals by 5 wickets
వరుసగా నాలుగో విజయం.. అగ్రస్థానంలో ముంబయి

By

Published : Oct 11, 2020, 11:36 PM IST

ముంబయి ఆల్‌రౌండ్​ షోతో మరోసారి అదరగొట్టింది. అబుదాబి వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (69*), శ్రేయస్ అయ్యర్ (42)‌ రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 19.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. డికాక్‌ (53), సూర్యకుమార్‌ (53) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ విజయంతో ముంబయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. రోహిత్‌ సేనకు వరుసగా ఇది నాలుగో విజయం.

హిట్‌మ్యాన్ విఫలమైనా..

ఛేదన ఆరంభించిన ముంబయికి గొప్ప ఆరంభమేమి దక్కలేదు. నిదానంగా ఆడిన రోహిత్ శర్మ (5, 12 బంతుల్లో) అయిదో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలో డికాక్‌ 32 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో అశ్విన్ బౌలింగ్‌లో షా చేతికి చిక్కాడు. అనంతరం ఇషాన్ కిషన్‌ (28)తో కలిసి సూర్యకుమార్ మరింత చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లు సాధిస్తూ 30 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తిచేశాడు. అయితే సూర్యను రబాడ బోల్తా కొట్టించాడు.

తర్వాతి ఓవర్‌లోనే హార్దిక్‌ పాండ్య ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. కొద్దిసేపటికే ఇషాన్‌ కూడా భారీషాట్‌కు యత్నించి ఔటవ్వడం వల్ల స్వల్పవ్యవధిలోనే ముంబయి వికెట్లు కోల్పోయింది. అయితే అప్పటికే దిల్లీకి జరగాల్సిన నష్టం వాటిల్లింది. కానీ దిల్లీ బౌలర్లు గొప్పగా పుంజుకుని మ్యాచ్‌ను ఆఖరి ఓవర్‌ వరకు తీసుకువచ్చారు. చివరి ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా క్రునాల్ పాండ్య (12*) రెండు బౌండరీలు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. పొలార్డ్ (11*) కూడా క్రీజులోనే ఉన్నాడు. దిల్లీ బౌలర్లలో రబాడ, స్టోయినిస్‌, అశ్విన్, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్ తీశారు.

రాణించిన గబ్బర్‌

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దిల్లీకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా (4)ను బౌల్ట్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న రహానె (15) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. ముచ్చటైన షాట్లతో వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో క్రునాల్ బౌలింగ్‌లో శ్రేయస్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన స్టోయినిస్‌ (13) రనౌటయ్యాడు. మరోవైపు ధావన్‌ నిలకడగా ఆడుతూ 39 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించాడు. అయితే ఆఖరి వరకు క్రీజులో ఉన్న గబ్బర్‌ ఆశించిన స్థాయిలో దూకుడుగా ఆడలేదు. ముంబయి బౌలర్లలో క్రునాల్ రెండు వికెట్లు, బౌల్ట్‌ ఒక్క వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details