కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా కేకేఆర్ తన పేరిట ఉన్న ఓ రికార్డును చెరిపేసుకుంది. అదేంటి అనుకుంటున్నారా? అవును. ఈ జట్టు 2012 నుంచి ఇప్పటివరకు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. కానీ ఈసారి అనూహ్య పరాజయంతో తన రికార్డును కోల్పోయింది.
పదమూడో సీజన్‌లోనూ కేకేఆర్ గెలుపు బోణీ కొట్టాలనుకుంది. శుభారంభం చేయాలనుకుంది. ముంబయి దాని ప్రణాళికలను పటాపంచలు చేసింది. ఏకంగా 49 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 195/5 పరుగులు చేయగా ఛేదనలో కార్తీక్ బృందం 146/7కు పరిమితమైంది. ఫలితంగా 2012 తర్వాత తొలిసారి మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
2013 సీజన్ ఆరంభ పోరులో దిల్లీని 6 వికెట్ల తేడాతో కోల్‌కతా ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 2014లోనైతే ముంబయిని ఏకంగా 41 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 164 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆ జట్టును 122/7కు పరిమితం చేసింది. 2015లోనూ ఇదే సన్నివేశం పునరావృతమైంది. ముంబయి నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో 18.3 ఓవర్లకే ఛేదించేసింది. 2016లో దిల్లీపై ఘనవిజయం సాధించింది.
ఆ తర్వాత సీజన్‌లో గుజరాత్ లయన్స్‌పై కోల్‌కతా భారీ విజయం అందుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమీ నష్టపోకుండానే 14.5 ఓవర్లలో సాధించింది. గౌతమ్ గంభీర్ (76; 48 బంతుల్లో 12×4), క్రిస్‌లిన్ (93; 41 బంతుల్లో 6×4, 8×6) వీర విహారం చేశారు. 2018లో బెంగళూరు తన ముందుంచిన 177 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల నష్టానికి 18.5 ఓవర్లలోనే కరిగించింది. 2019లోనూ అంతే. హైదరాబాద్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో మరో 2 బంతులు మిగిలుండగానే కొట్టేసింది.