సన్నిహితంగా ఉండే ఆటగాళ్లు అప్పుడప్పుడు అసభ్య పదజాలంతో మాట్లాడుకోవడం క్రికెట్లో మామూలే! ఒకే రాష్ట్రం, ఒకే భాష తెలిసిన ఆటగాళ్లైతే తమ స్థానిక భాషలో సరదాగా కొన్ని మాటలు అనుకుంటుంటారు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ ఎవరినో ఉద్దేశించి ఓ బూతు పదాన్ని వాడాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
బూతు పదం వాడి నెటిజన్లకు చిక్కిన రాహుల్ - రాహుల్ బూతు మాట
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ బూతు పదం వాడి నెటిజన్ల దృష్టిలో పడ్డాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది.
పంజాబ్ జట్టుకు ఈ సారి కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. దిల్లీతో ఆ జట్టు తొలి మ్యాచ్ ఆడింది. రెండు జట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. ఈ పోరులో పంజాబ్ తొలుత ఫీల్డింగ్ చేసింది. మహ్మద్ షమీ విజృంభించడం వల్ల దిల్లీని తక్కువ పరుగులకే కట్టడి చేసేలా కనిపించింది. కాగా స్టోయినిస్, శ్రేయస్ దూకుడుగా ఆడటం వల్ల కాపాడుకోగల స్కోర్ చేసింది. ఫీల్డింగ్ తప్పిదాలు జరగడం, పరుగులు ఎక్కువగా వస్తుండటం వల్ల రాహుల్ కాస్త దూకుడుగానే కనిపించాడు. తన జట్టులో ఎవరినో ఉద్దేశించి ఓ బూతు పదం ప్రయోగించాడు.
బహుశా రాహుల్ కర్ణాటక ఆటగాళ్లను ఉద్దేశించే అన్నాడని అనుకుంటున్నారు. మయాంక్ అగర్వాల్, కృష్ణప్ప గౌతమ్, కరుణ్ నాయర్ అదే రాష్ట్రానికి ఆడతారు. వీరంతా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి వీరిలోనే ఎవరినో ఒకరిని అన్నాడని తెలుస్తోంది. నిజానికి అతడన్న మాట బయటకు వినిపించదు. స్టేడియంలో అభిమానులు లేకపోవడం వల్ల స్టంప్‌మైక్‌లో రికార్డవ్వడం గమనార్హం. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ రెండో మ్యాచ్‌లో తలపడనుంది.