ఈ ఐపీఎల్ సీజన్‌లోని ప్రారంభ మ్యాచుల్లో వరుసగా ఓడినా.. రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఓటమి తప్పదనుకున్న మ్యాచుల్లోనూ బాగా పోరాడి, విజయాలను సాధించింది. అయితే ఇదంతా కేఎల్ రాహుల్ సారథ్యం, కోచ్ అనిల్ కుంబ్లే పోరాడేతత్వం వల్లే జరిగిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
"గెలిచే దారిని పంజాబ్ కనుక్కుంది. లీగ్ ఆరంభంలో గెలవలేకపోయింది. ప్రతిసారి విజయానికి చేరువగా వచ్చి ఓడింది. కానీ గత కొన్ని మ్యాచుల నుంచి అద్భుతంగా ఆడుతోంది. సన్‌రైజర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులే చేసినా సరే 12 పరుగుల తేడాతో విజయం సాధించడం సంచలనం. పంజాబ్ ఆటగాళ్లు తమను తాము బలంగా నమ్మారు. జట్టును రాహుల్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా బాగా ఎదిగాడు. ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలింగ్ మార్పు విషయాలలో అతడు రాటుదేలాడు. ముఖ్యంగా కోచ్ కుంబ్లే పాత్రను మరవకూడదు. క్రికెట్ కెరీర్ మొత్తం అతడు పోరాడుతూనే ఉన్నాడు. దెబ్బతగిలినా మ్యాచులు ఆడి పంజాబ్ జట్టులో స్ఫూర్తిని నింపాడు. క్లిష్ట పరిస్థితుల్లో పంజాబ్ పుంజుకుని.. ప్లేఆఫ్స్ రేసులోనూ నిలిచిందంటే అది వీరిద్దరి వల్లే"