ఈసారి ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలస్తుందని కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మన్ ఇయాన్ మోర్గాన్ జోస్యం చెప్పాడు. ఆదివారం దిల్లీతో మ్యాచ్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచులో అతడు క్రీజులోకి వచ్చేసరికి.. 43 బంతుల్లో 113 పరుగులు చేయాలి కోల్కతా. వచ్చిరాగానే 18 బంతుల్లో ఫోర్, ఐదు సిక్సర్లతో మోత మోగించాడు. దీంతో ఇతడిని టాప్ ఆర్డలో దించుంటే మరింత విజృంభించేవాడని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాను ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగడంపైనా స్పందించాడు మోర్గాన్. తాను ఆలస్యంగా క్రీజులోకి వచ్చాననుకోవట్లేదని అన్నాడు.
"నేను క్రీజులోకి ఆలస్యంగా వచ్చానని భావించట్లేదు. మా బ్యాటింగ్ లైనప్లో చాలా మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. అయినా ప్రపంచస్థాయి ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ ఉండగా మిగతా ఆటగాళ్లు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగడం కష్టం. దిల్లీ జట్టు విషయానికొస్తే బౌలర్లు బాగా కట్టడి చేశారు. ఈ సీజన్లో వారే ట్రోఫీని అందుకునే అవకాశాలు ఉన్నాయి"
-మోర్గాన్, కోల్కతా బ్యాట్స్మన్