ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (68*) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు.
రాజస్థాన్ ఇంటికి.. కోల్‌కతా ఆశలు సజీవం
దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల భారీ తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ప్లేఆఫ్ రేసులో మోర్గాన్ సేన నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 131 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టును కమిన్స్ (4/34) ఘోరంగా దెబ్బతీశాడు. బట్లర్ (35) టాప్ స్కోరర్. ఘోర పరాజయాన్ని చవిచూసిన రాజస్థాన్ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే టాప్-4 రేసులో కోల్‌కతా నిలవాలంటే ముంబయి×హైదరాబాద్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంది. హైదరాబాద్ ఓటమి పాలైతే కోల్‌కతా 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ వార్నర్‌సేన విజయం సాధిస్తే నెట్‌రన్‌రేటు ఆధారంగా కోల్‌కతా ఇంటిముఖం పడుతుంది.