దుబాయ్ వేదికగా మరో రసవత్త పోరుకు రంగం సిద్ధమైంది. తొమ్మిదింటిలో ఏడు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్.. ఆరు మ్యాచుల్లో ఓడి, ఆరో స్థానంలో ఉన్న పంజాబ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
మరో విజయాన్ని అందుకుంటుందా?
దిల్లీ క్యాపిటల్స్, గెలుపు గుర్రంపై సవారీ చేస్తోంది. చెన్నైతో ఆడిన గత మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సెంచరీతో మెరిశాడు. పృథ్వీషా, అజింక్యా రహానె మాత్రం వరుసగా విఫలమవుతున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ పర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్ లైనప్‌లో కగిసో రబాడ, అశ్విన్, అన్రిచ్, స్టోయినిస్ మెరుగ్గా రాణిస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో పెద్దగా మార్పులేమీ జరగకపోవచ్చు. మొత్తంగా ఫామ్‌లో ఉన్న దిల్లీ ఆటగాళ్లు.. తమ ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుంటే ఇందులోనూ గెలిచే అవకాశముంటుంది.
ఆత్మవిశ్వాసంతో బరిలోకి
ఈ సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో కేఎల్ రాహుల్(525), మయాంక్ అగర్వాల్(393) ముందున్నారు. వీరిద్దరూ పంజాబ్ జట్టుకే ఆడుతున్నారు. అయినా మిగిలిన వారి నుంచి సహకారం లేకపోవడం, అదృష్టం కలిసి రాకపోవడం వల్ల మ్యాచ్‌లు ఓడిపోతోందీ జట్టు. ఎట్టకేలకు రెండో సూపర్ ఓవర్‌కు దారీ తీసిన గత మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధించింది. కెప్టెన్ రాహుల్(77) తన బ్యాటింగ్‌తో విజయాన్ని అందించాడు. గేల్, మయాంక్ కూడా గెలుపులో కీలకపాత్ర పోషించారు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. బౌలింగ్‌లో షమి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ మినహా మిగిలిన వాళ్లు సరిగా ఆడలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో గెలిచి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని దిల్లీపై బరిలో దిగుతున్నారు. అయితే ఇప్పటికే ఫ్లే ఆఫ్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న పంజాబ్‌కు, ఈ మ్యాచ్ చాలా కీలకం.
జట్లు (అంచనా)
పంజాబ్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, షమి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
దిల్లీ: పృథ్వీషా, శిఖర్ ధావన్, రహానె, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), స్టోయినిస్, క్యారీ, అక్షర్ పటేల్, అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, రబాడ, అన్రిచ్