దుబాయ్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. 207పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ.. 17ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పంజాబ్ బౌలర్లలో మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్ తలో మూడు వికెట్లు పడగొట్టి ఆర్సీబీని దెబ్బతీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది పంజాబ్. తొలి ఇన్నింగ్స్‌లో దంచేసిన కేఎల్ రాహుల్(132*)కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
డీలాపడ్డ ఆర్సీబీ...
భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో అర్థశతకంతో మెరిసిన దేవదత్త.. తొలి ఓవర్లో కేవలం ఒక పరుగే చేసి ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లో జోష్ ఫిలిప్పి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ(1), శివమ్ దుబె(12) పెవీలియన్‌కు క్యూ కట్టారు. అరోన్ ఫించ్(20), సుందర్(30), ఏబీ డివీలియర్స్(28)లు కొద్దిసేపు క్రీజులో నిలిచినా ఫలితం దక్కలేదు. మొత్తంగా తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచినా.. రెండో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైంది ఆర్సీబీ.
రాహుల్ ధనాధన్..
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సారథి కేఎల్ రాహుల్ (132; 69 బంతుల్లో 14x4, 7x6) ఓపెనర్‌గా బరిలో దిగి చివరి వరకు క్రీజులో ఉండి శతకంతో చెలరేగాడు. మయాంక్ అగర్వాల్(26; 20 బంతుల్లో 4x4), నికోలస్ పూరన్ (17; 18 బంతుల్లో 1x4), కరున్ నాయర్ (15; 8 బంతుల్లో 2x4) కూడా చెలరేగి ఆడారు.