రెండు మూడేళ్ల క్రితం వరకూ క్రికెట్ ప్రపంచానికి అంతగా పరిచయం లేని పేరది. కానీ ఇటీవల కాలంలో బౌలింగ్‌లో అతడి మెరుపులు.. అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ విరుచుకుపడుతూ విన్యాసాలే అతడి అసమాన ప్రతిభకు తార్కాణాలు. వెస్టిండీస్‌లో పుట్టి.. అక్కడి జాతీయ జట్టులో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ క్రికెటర్‌గా చిన్న వయసులోనే అరంగ్రేటం చేసిన జోఫ్రా ఆర్చర్ గురించి ఆసక్తికరమైన సంగతులు వేరే ఉన్నాయి.
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతూ నాణ్యమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి సంబంధించి వెలుగులోకి వచ్చిన మరో కోణం అందరినీ ఆకర్షిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ఆటపరంగా కాకుండా మరో రకంగా సామాజిక మాధ్యమాల్లో పేరు హోరెత్తడటమే అతడి ప్రత్యేకత. అదే జోఫ్రా ఆర్చర్ భవిష్యవాణి. రంగం చెప్పటం అనుకోవచ్చు, జరగబోయేది ముందే ఊహించటం కావచ్చు. నిన్న మొన్న జరిగిన సంఘటనలను కొన్నేళ్ల క్రితమే ఊహించి ట్విట్టర్లో పెట్టిన అతడి ట్వీట్లే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
1995 ఏప్రిల్ 1న కరేబియన్ దీవి బార్బడోస్‌లో పుట్టిన జోఫ్రా... తొలుత వెస్టిండీస్ తరపున నాలుగేళ్ల పాటు అండర్ 19 క్రికెట్ ఆడాడు. తన తండ్రి పౌరసత్వంతో ఇంగ్లండ్ కౌంటీల్లోకి ప్రవేశించాడు. అనతి కాలంలోనే అద్భుత ప్రదర్శనతో ఇంగ్లీష్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. 2019 మేలో తన తొలి మ్యాచ్ ఆడిన ఆర్చర్.. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీలో తన సత్తా చాటాడు. 2020 ఏప్రిల్‌లో ప్రకటించిన విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్లో ఒకడిగా ఎంపికై, చిన్నవయసులోనే క్రికెట్లోని అత్యున్నత గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు.
అతడి ప్రతిభ సంగతి అలా ఉంచితే ఇప్పుడు ఆర్చర్ పేరు మరోసారి మారుమోగటానికి కారణం, చెన్నై సూపర్స్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆఖరి ఓవర్లో నాలుగు సిక్సర్లు బాది.. తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆర్చర్ చివరి ఓవర్లో బాదిన ఆ నాలుగు సిక్సర్లే చెన్నై, రాజస్థాన్ జట్ల గెలుపు అంతరం అంటే అతను చివర్లో రాబట్టిన పరుగులు అంత విలువైనవి.
ఇలా ఓ ఓవర్ లో 30 పరుగులు.. వరుసగా నాలుగు సిక్సర్ల గురించి జోఫ్రా ఆర్చర్ ఐదారేళ్ల క్రితమే చెప్పాడంటే నమ్ముతారా? అవును అప్పటికి కనీసం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సైతం జోఫ్రా ఆర్చర్ పేరు తెలియదు. కానీ నో బాల్ పడుతుందని.. వరుసగా నాలుగు సిక్సర్లతో కలిపి ఓవర్లో 30 పరుగులు వస్తాయని 2014, 2015 ల్లో వేర్వేరుగా జోఫ్రా చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
సరే ఇదంటే కాకతాళీయం అనుకోవచ్చు. భారత్‌లో కరోనాపై పోరాడేందుకు ఆత్మస్థైర్యాన్ని చాటేలా దీపాలను వెలిగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును కూడా ఆరేళ్ల క్రితమే సమయంతో సహా ఊహించి ఆర్చర్ చేసిన ట్వీట్లు ఎందరినో ఆశ్చర్యానికి గురిచేశాయి.
2014 మార్చిలో దీపకాంతులను స్ఫురించేలా చేసిన మూడు ట్వీట్లు, ఆర్చర్‌కు భవిష్యత్ తెలుస్తోందా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న రియాచక్రవర్తిని స్ఫురణకు తీసుకువచ్చేలా, 2013 సెప్టెంబరులోనే రియా ఫిర్యాదు పేరిట జోఫ్రా చేసిన ట్వీట్, 21 రోజులు ఇంట్లో ఉంటే సరిపోతుందా? అసలు మనుషులు ఎక్కడికీ వెళ్లలేని ఎటూ తిరగలేని రోజు ఒకటి వస్తుందంటూ కరోనా లాక్‌డౌన్‌ను ప్రతిబింబించేలా 2014లో చేసిన ట్వీట్లు ఇలా ఒకటా రెండా.. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దానికి సంబంధించి జోఫ్రా ఆర్చర్ ఎప్పుడో ట్వీట్ చేసి ఉంటాడని అతని టైమ్‌లైన్‌ను జనాలు జల్లెడపట్టేలా ఆర్చర్ ట్వీట్లు వైరల్ అయిపోయాయి.
పెట్రోల్ ధరలు, చెన్నై జట్టుకు రైనా దూరం అవటం, ప్రపంచకప్ లో వెస్టిండీస్ గెలుపు కోసం కార్లోస్ బ్రాత్ వైట్ ఆడిన ఇన్నింగ్స్, దక్షిణాఫ్రికాకు ఏబీ డివిలియర్స్ దూరం కావటం ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. కొందరు అభిమానులు ఆర్చర్‌కు కాలంలో ప్రయాణించే శక్తి ఉందని, భవిష్యత్‌లో జరిగే వాటిని ఊహించగలడని నమ్ముతున్నారు. అతడో అభినవ నోస్ట్రడోమస్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇంగ్లాండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్
ఆర్చర్ మాత్రం తన ప్రెడిక్షన్స్ పై పెద్దగా వివరణలు ఇచ్చుకున్నదే లేదు. "గాడ్ లెట్ మీ ఎక్సెప్ట్ ద థింగ్స్ ఐ కేంట్ ఛేంజ్, కరేజ్ టూ ఛేంజ్, కరేజ్ టూ ఛేంజ్ థింగ్స్ ఐ కెన్ అండ్ విజ్డమ్ టూ నో ద డిఫరెన్స్" అని 2015 లో చేసిన ట్వీట్‌ను తన టైమ్‌లైన్‌పై పిన్ చేసి ఉంచడం జోఫ్రా తత్వాన్ని తెలియజేస్తుంది.
ఈ ట్వీట్లపై హేతువాదులు మాత్రం మరో రకమైన విశ్లేషణ చెబుతున్నారు. వీటన్నింటినీ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, చాలా వరకు యాద్ధృచ్ఛికమని, మరికొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే ఊహాగానాలేనని తేల్చేస్తున్నారు. అసలు జోఫ్రా ట్విట్టర్ అకౌంట్ ను ఓసారి పరిశీలిస్తే రోజుకు కనీసం పదుల సంఖ్యలో అతను ట్వీట్లు చేస్తాడు. అలా ఆరేడేళ్ల క్రితం ట్వీట్లను వెతకాలన్న చాలా కష్టమైన పనే.
అంతేకాదు ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం అది ఓ పనికావచ్చు, ఓ మాట కావచ్చు, ఏదైనా చిన్న కదలికైనా కావచ్చు.. అదే ప్రపంచంలో ఏదో ఒక సమయంలో మరేదో ఒక విషయంతో సరిపోలవచ్చు లేదా దాన్ని ప్రభావితం చేయవచ్చు. దీన్నే పాశ్చాత్య దేశాల్లో ఖేయాస్ థియరీ లేదా బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటారు. దశావతారం సినిమాలో ఓ దగ్గర సీతాకోక చిలుక చేసిన రెక్కల చప్పుడు, మరోవైపు సునామీకి కారణమై ప్రకృతిని సమతూకం చేయవచ్చంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చిన థియరీ అచ్చం ఇలాంటిదే. అందుకే ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటిని చూసి ఆనందించాలే తప్ప మరీ లోతుగా ఆలోచించటమో లేదా వారికి మానవాతీత శక్తులను ఆపాదించటమో చేయటం హేతువాద దృక్పథం కాదనీ విశ్లేషిస్తున్నారు.