తెలంగాణ

telangana

ETV Bharat / sports

తడబడి నిలబడడమే ముంబయి ఇండియన్స్​ నైజం - Mumbai Indians first match los

ఎవరైనా తొలి అడుగు నుంచే విజయపథం వైపు నడవాలని కోరుకుంటారు. కానీ ఈ క్రికెట్ జట్టు అభిమానులు మాత్రం అందుకు భిన్నం. మొదటి మ్యాచ్ ఓడిపోతే ఇక కప్ మనదే అనే రేంజ్​లో సంబరాలు చేసుకుంటారు. ఇదేం చిత్రమైన కోరిక అనిపించినప్పటికీ కొన్నేళ్లుగా ఆ జట్టు ప్రస్థానం చూస్తే వాళ్లనుకునేది నిజమేనని స్పష్టమౌతుంది. యాధృచ్ఛికమో, కాకతాళీయమో క్రమేపీ ముంబయి ఇండియన్స్​కు ఇది సెంటిమెంట్​గా మారుతోంది.

Mumbai Indians first match loss Sentiment continues
తడబడి నిలబడే ముంబయి ఇండియన్స్​

By

Published : Sep 20, 2020, 12:28 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

విజయం ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ధైర్యంగా నిలబడి పోరాడేలా చేస్తుంది. ప్రత్యేకించి ఐపీఎల్ లాంటి భారీ టోర్నీలో ప్రతి మ్యాచ్ కీలకమే. ఒకటి, రెండు పాయింట్ల తేడాతో ప్లేఆఫ్ బెర్తులు కోల్పోయిన సంఘటనలు, ఇంటి దారి పట్టిన వైనాలను ఎన్నో జట్లు రుచిచూశాయి. అందుకే ప్రతి అభిమానీ తనకిష్టమైన జట్టు ఎదురైన ప్రత్యర్థులందరినీ చిత్తు చేయాలని ఆకాంక్షిస్తూ ఉంటాడు. మొదటి మ్యాచ్ నుంచే తమ టీమ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటుంటాడు. కానీ ముంబయి ఇండియన్స్ అభిమానులు మాత్రం ఇందుకు మినహాయింపు. తన మొదటి మ్యాచ్​లో ముంబయి ఓడిపోతే ఇక తమ జట్టు ప్లేఆఫ్​కి దూసుకెళ్లటమే కాదు కప్పూ ఎగరేసుకుపోతుందని ఫిక్సయిపోతారు. గడిచిన కొన్నేళ్లుగా ముంబయి జట్టు ప్రస్థానాన్ని నిశితంగా పరిశీలిస్తే అదే తెలుస్తుందని అభిమానుల బలమైన అభిప్రాయం. పోనీ యాధృచ్ఛికంగా జరిగిందే అనుకున్నా అదే తమ టీమ్​కి లక్కీ మస్కట్ అని భావిస్తుంటారు ముంబయికర్స్.

చెన్నై-ముంబయి మ్యాచ్

అదే అభిమానుల ధైర్యం

పోతే పోనీ పోరా అని.. ఓ సినీ రచయిత అన్నట్లు.. ఆదిలోనే హంసపాదు ముంబయి అభిమానులకు ఇష్టంగా మారిపోయింది. ఐపీఎల్​లో ఇటీవలి కాలంలో ఓసారి ముంబయి ప్రదర్శన చూస్తే 2013లో ఆర్సీబీపై, 2014,15 ల్లో కేకేఆర్​పై, 2016,17 ల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ పై, 2018లో సీఎస్కే మీద, 2019లో దిల్లీ క్యాపిటల్స్ పై ముంబయి ఇండియన్స్ తమ తొలి మ్యాచ్​లు ఆడి ఓటమి పాలైంది. కానీ ఆ తర్వాత మ్యాచ్​ల్లో అద్వితీయ ప్రదర్శనతో 2013, 2015, 2017, 2019ల్లో ఫైనల్స్​కు దూసుకెళ్లి గెలిచి రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ట్రోఫీని కైవసం చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. అందుకే 2020 టోర్నీకి ఆరంభ మ్యాచ్​గా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి సీఎస్కే చేతిలో ఓడినా తమకి అచ్చొచ్చిన తొలి పరాభవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ముంబయి ఇండియన్స్ అభిమానులు.

రోహిత్ ధోనీ

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ధోనీ ఆడిన తొలి మ్యాచ్ గెలిచామన్న సంబరాల్లో చెన్నై అభిమానులుంటే ముంబయి ఫ్యాన్స్ మాత్రం మరో మారు తమ సెంటిమెంట్ కలిసి వస్తుందంటూ సోషల్ మీడియాను మీమ్స్​తో మారుమోగించారు. గతంలో ఓడిపోయిన తొలి మ్యాచ్​లను.. ఆ తర్వాత కప్ ఎగరేసుకుపోయిన విధానాన్ని గుర్తు చేస్తూ వేల సంఖ్యలో పోస్టులు, మీమ్​లను వైరల్ చేశారు.

అభిమానుల సంగతి ఇలా ఉంటే ముంబయి తొలిమ్యాచ్​ల ఓటమిపై మరో విధంగా భాష్యం చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. మిగిలిన జట్లతో పోల్చి చూసినప్పుడు ముంబయి ఇండియన్స్ జట్టులో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ పరిస్థితి ఎప్పుడూ ప్రశ్నార్థకమే. కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా లాంటి హార్డ్ హిట్టర్లు ఉన్నా వాళ్లు కేవలం హిట్టర్లు కావటమే చాలా సార్లు తొందరపాటు తప్పిదాలకు కారణమౌతోంది. క్రికెట్​లో చాలాసార్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సి ఉంటుంది.

చెన్నై-ముంబయి మ్యాచ్

నిన్నటి మ్యాచ్​నే ఉదాహరణగా తీసుకున్నా డాడీస్ ఆర్మీగా పేరుతెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిలకడ రహస్యం అదే. డుప్లెసిస్ జోరుగా బ్యాట్ ఝుళిపించే ఆటగాడే అయినా 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో మరో సహచర ఆటగాడు రాయుడికి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ నిర్మించిన విధానమే రెండు జట్లకి తేడా.

చెన్నై-ముంబయి మ్యాచ్

ప్రతిభావంతుడైన రోహిత్ శర్మ, కీ ప్లేయర్ డికాక్ ఔటైన తర్వాత అలా ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను మిగిలిన ముంబయి బ్యాట్స్​మన్ తీసుకోవటంలో విఫలమవటం వాళ్ల వైఫల్యాలకు కనిపించే కారణం. కానీ ఓటమి నుంచి పాఠాలను నేర్చుకునే తత్వం ఉండటం ముంబయి పోరాట స్ఫూర్తికి నిదర్శనం. 2014లో ఇదే యూఏఈలో జరిగిన ఐపీఎల్​లో తొలి ఐదు మ్యాచ్​లు ఓడిపోయిన ముంబయి పడిలేచిన కెరటంలా సాధించిన విజయాలు తప్పక గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్​లో కేవలం 14.2 ఓవర్లలోనే 190 పరుగులను ఛేదించి ప్లేఆఫ్స్ కి వెళ్లిన విధానం ఏ క్రికెట్ అభిమానీ మర్చిపోడు. ఆ రకంగా చూసుకుంటే నిదానమే ప్రదానం అన్నట్లు టోర్నీని ఆరభించినా ఒక్కసారి ఊపందుకున్న తర్వాత ముంబయి ఇచ్చే పోటీ ఏ రేంజ్​లో ఉంటుందో గత సీజన్లలో వాళ్ల ప్రదర్శన చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details