దిల్లీ క్యాపిటల్స్.. ఇంతకుముందు దిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఉండేది. కానీ గత సీజన్లో పేరును మార్చుకుంది. అయినా ఈ జట్టుకు అంతగా అదృష్టమేమీ కలిసిరాలేదు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ జట్టు గత ఐపీఎల్లో ప్లే ఆఫ్స్‌కు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈసారి వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుని నూతనోత్సాహంతో బరిలో దిగబోతుంది. యువకులతో కూడిన ఈ జట్టు ఈ లీగ్‌లో ఎంతమేర రాణించగలదు? ఈ జట్టు బలాలు, బలహీనతలు ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.
బలాలు
ఈ జట్టుకు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. గత బిగ్‌బాష్ లీగ్‌లో సత్తాచాటిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను ఈసారి వేలంలో దక్కించుకుంది. ఇతడు ఈ జట్టుకు కీలక ఆటగాడిగా మారనున్నాడు. అలాగే మిడిలార్డర్లో నమ్మదగిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ కారేను తీసుకున్నారు. హెట్మెయర్ రూపంలో మరో విధ్వంసకర ఆటగాడు జట్టులో చేరాడు.
పృథ్వీ షా, శిఖర్ ధావన్ రూపంలో అదిరిపోయే ఓపెనింగ్ జోడీ కుదిరింది. మూడు, నాలుగు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించగలడు. అలాగే ఈసారి టాపార్డర్‌లో మరింత బలం కోసం ఎంతో అనుభవమున్న అజింక్యా రహానేను తీసుకున్నారు.
అనుభవమున్న రవిచంద్రన్ అశ్విన్ రాకతో స్పిన్ విభాగం పటిష్ఠంగా కనబడుతోంది. ఇతడికి తోడు ఇప్పటికే అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, నేపాల్ యువ స్పిన్నర్ సందీప్ లమిచానే రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న వీరితో యూఏఈలో క్యాపిటల్స్ సత్తాచాటాలని భావిస్తోంది.
బలహీనతలు
ట్రెంట్ బౌల్ట్‌ను ట్రేడ్ ఆప్షన్లో ముంబయికి అప్పజెప్పిన దిల్లీలో ఈసారి కగిసో రబాడా మాత్రమే చెప్పుకోదగ్గ విదేశీ పేసర్. క్రిస్ వోక్స్ లాంటి ఆల్‌రౌండర్‌ను తీసుకున్నా అతడు ఈలీగ్కు దూరమయ్యాడు. దీంతో ఇతడి స్థానంలో ఎన్రిచ్ నోట్జేను తీసుకున్నారు. కానీ ఇతడికి అంతగా అనుభవం లేదు. డేనియల్ సామ్స్ రూపంలో అన్క్యాప్డ్ ఆస్ట్రేలియా పేసర్ ఉన్నా ఇతడి అవకాశాలు రావడం కష్టమే. అలాగే ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మ లాంటి భారత పేసర్లు ఉన్నా వీరి ప్రదర్శనపై పూర్తి నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు క్రీడా పండితులు.