ఐపీఎల్ కప్పు కోసం ఫైనల్ల్లో అడుగుపెట్టే జట్టేదో మరికొద్ది గంటల్లో తెలిసిపోనుంది. క్వాలిఫయర్1లో ఓడిన దిల్లీ.. ఎలినినేటర్లో గెలిచిన హైదరాబాద్ మధ్య అబుదాబి వేదికగా క్వాలిఫయర్-2 జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. మరి ఎవరు గెలుస్తారో?
ఏమో కష్టమే
లీగ్ రెండో అర్ధ భాగంలో దిల్లీ క్యాపిటల్స్ అస్థిర ప్రదర్శన కనబరుస్తూ అభిమానులను నిరాశ పరుస్తోంది. ప్లేఆఫ్స్‌లోని క్వాలిఫయర్1లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. స్టోయినిస్(65), అక్షర్ పటేల్(42), అశ్విన్ 3 వికెట్లు తీయడం మినహా అందరూ విఫలమయ్యారు.
టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్(525), పృథ్వీ షా(228), అజింక్య రహానె(111) ఇప్పటికైనా సరే ఫామ్‌లోకి రావాలి. బౌలర్లలో రబాడ(25), అన్రిచ్(20), అశ్విన్(13) బాగానే రాణిస్తున్నారు. మొత్తంగా జట్టు ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణిస్తేనే ఫైనల్‌కు చేరుతుంది. లేదంటే కష్టమే.
దూకుడు మీదున్న వార్నర్‌సేన
హైదరాబాద్ జట్టు సీజన్ రెండో అర్ధభాగంలో దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. వార్నర్, సాహా ఓపెనింగ్ వచ్చి అదరగొడుతున్నారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో వార్నర్ కొంచెం డీలా పడ్డాడు. గాయం కారణంగా సాహా ఆడలేకపోయాడు. క్వాలిఫయర్-2లో అతడు బరిలో దిగే అవకాశముంది. బెయిర్ స్టో, మనీశ్ పాండే బాగా ఆడుతున్నారు. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ బ్యాట్, బంతితో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు.
బౌలింగ్ విభాగం కూడా అదరగొడుతోంది. పవర్‌ప్లేలో సందీప్ శర్మ, మిడిల్ ఓవర్లలో హోల్డర్, షబాజ్ నదీమ్, రషీద్ ఖాన్.. డెత్ ఓవర్లలో యార్కర్ల స్పెషలిస్ట్ టి.నటరాజన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కు చెమటలు పట్టిస్తున్నారు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఫైనల్లో అడుగుపెట్టడం పెద్ద కష్టమేమి కాదు.
జట్లు (అంచనా)
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్
దిల్లీ క్యాపిటల్స్ :పృథ్వీ షా, శిఖర్ ధావన్, రహానె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, అశ్విన్, రబాడ, అన్రిచ్
ఇదీ చూడండి:వార్నర్ సేన అదరహో.. బెంగళూరు ఇంటికి