మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో విజయం సాధించిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడి.. చివరి స్థానంలో ఉంది పంజాబ్. ఇప్పుడీ రెండు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఇరుజట్ల బలాలు బలహీనతలపై కథనం.
ఇప్పుడైనా సరైన వ్యూహంతో వస్తారా?
గత మ్యాచ్‌లో చెన్నై దూకుడును ఆపడం పంజాబ్ బౌలర్లకు కష్టమైంది. ఓపెనర్లు డుప్లెసిస్, వాట్సన్ ఇద్దరే 179 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో రాహుల్ బృందానికి ఓటమి తప్పలేదు. షమి, రవి బిష్ణోయ్ లాంటి బౌలర్లు ఉన్నాసరే విజయం దక్కలేదు. మరోవైపు మయాంక్ అగర్వాల్, మ్యాక్స్‌వెల్, కేఎల్ రాహుల్ లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌తో బ్యాటింగ్ విభాగం బలంగానే ఉన్నా, వ్యూహంలో సరైన స్పష్టతలేనట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఎలాంటి ప్రణాళికలతో బరిలో దిగుతారో చూడాలి.
మరో మెట్టు పైకెక్కాలని
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన గత రెండు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. స్టార్ ఫ్రాంచైజీ చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో కుర్రాళ్లు ప్రియమ్‌గార్గ్(51), అభిషేక్ శర్మ(31) అదరగొట్టారు. బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి విజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్. ఆ తర్వాత ముంబయితో ఆడిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో కాస్త తడబడినట్లు కనిపించింది. ఫలితంగా 208 పరుగుల భారీ స్కోరును ఇచ్చింది. ఛేదనలో వార్నర్, మనీశ్ పాండే, బెయిర్ స్టో ఎంత పోరాడినా విజయం మాత్రం దక్కలేదు.