మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో విజయం సాధించిన దిల్లీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడి.. దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది రాయల్స్. ఇప్పుడీ రెండు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఇరుజట్ల బలాలు బలహీనతలపై కథనం.
ఈసారైనా గెలవాలనే కసితో
రాజస్థాన్ రాయల్స్ షార్జా వేదికగా జరిగిన తమ తొలి రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి అభిమానులకు అసలైన ఐపీఎల్ మజా పంచింది. కానీ అనంతరం ఆడిన మూడు మ్యాచుల్లో పరాజయాల పరంపర కొనసాగించింది. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన జాస్ బట్లర్ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. జయదేవ్ ఉనద్కత్, యువ ఆటగాడు రియాన్ పరాగ్ కూడా పేలవ ప్రదర్శన చేస్తున్నారు. కాగా, సారథి స్మిత్, తెవాతియా, సంజూ శాంసన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిసినా ఫలితం దక్కట్లేదు. తొలి రెండు మ్యాచుల్లో వీరి అండ వల్లే రాజస్థాన్ విజయాన్ని దక్కించుకుంది. కాబట్టి దిల్లీతో జరిగే మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేసుకుని సమష్టిగా రాణిస్తేనే తప్ప గెలవడం కష్టమనే చెప్పాలి. మరో విశేషమేంటంటే ఈ మ్యాచ్ షార్జాలో జరగనుంది. విజయం సాధించిన తొలి రెండు మ్యాచులను రాయల్స్ ఇక్కడే ఆడింది. కాబట్టి ఈ వేదికపైన మరోసారి రాజస్థాన్‌కు అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.
ఫుల్ జోష్.. తగ్గేదే లేదు
దిల్లీ క్యాపిటల్స్ విజయాల పరంపరతో గెలుపు గుర్రంపై సవారీ చేస్తోంది. జట్టులోని స్టార్ ఆటగాళ్లైన ఓపెనర్లు పృథ్వీ షా, రిషభ్ పంత్ అదరగొడుతున్నారు. మార్కస్ స్టోయినిస్ చెలరేగిపోతున్నాడు. సారథి శ్రేయస్ వ్యూహాలను రచించి తమ ఆటగాళ్ల చేత పక్కాగా అమలు చేయిస్తున్నాడు. అతడూ బాగానే రాణిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో కగిసొ రబాడా, ఎన్రిచ్ నోర్ట్జే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టిస్తున్నారు. ఇదే ఫామ్‌ను వీరు కొనసాగిస్తే రాయల్స్ మరో ఓటమి మూటగట్టుకోవడం ఖాయం.