ఇండియన్ టీ20 లీగు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా తయారవుతోంది. ప్లేఆఫ్స్ ఇక ఖాయమే అనుకున్న జట్లు అనూహ్యంగా ఓటమి పాలవుతున్నాయి. ఇక పనైపోయిందనుకున్న పట్టికలోని కింది జట్లు విజయ ఢంకా మోగిస్తున్నాయి. మ్యాచు మ్యాచుకూ పరిస్థితులు తారుమారు అవుతుండటంతో నాకౌట్‌కు చేరుకొనే నాలుగో జట్టేదో ఇప్పుడే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. తాజాగా దిల్లీపై హైదరాబాద్ విజయదుందుభి మోగించడంతో సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
ఎవరో ఒకరు ఖాయం
పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబయి, బెంగళూరు బుధవారం తలపడుతున్నాయి. వీరిప్పుడు 14 పాయింట్లతో సమంగా ఉన్నారు. ఏదో ఓ జట్టు గెలవక తప్పదు. దాంతో 16 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుకొనే మొదటి బృందంగా నిలుస్తుంది. 11 మ్యాచులాడిన ఈ రెండు జట్లకు రెండో అర్ధభాగంలో పరాజయాలు ఎదురవ్వడంతో గెలుపు కోసం తహతహలాడుతున్నాయి. మరి నేటి పోరులో విజయం కోహ్లీసేనదా? రోహిత్ బృందానిదా? చూడాలి.
ఈ మ్యాచులో బెంగళూరు గెలిస్తే హైదరాబాద్, దిల్లీ చేతిలో ఓడినా ఫర్వాలేదు. అయితే రన్‌రేట్ మాత్రం మెరుగ్గానే ఉంచుకోవాలి. ముంబయి చేతిలో ఓడితే మాత్రం మిగతా రెండు మ్యాచుల్లో గెలిస్తేనే టాప్-2లో అవకాశం ఉంటుంది. ముంబయి పరిస్థితీ ఇంచుమించు అలాంటిదే. కోహ్లీసేన చేతిలో ఓడితే.. మళ్లీ హైదరాబాద్, దిల్లీ జట్లలో ఏదో ఒకదానిపై విజయం అందుకోవాల్సిందే. టేబుల్ టాపర్ అవ్వాలంటే మాత్రం రెండింట్లోనూ గెలవాలి. ఏదేమైనప్పటికీ ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ చేరుకోవడం ఖాయం!
దిల్లీ.. తికమక
ఎటొచ్చీ దిల్లీ పరిస్థితే ఇప్పుడు గందరగోళంగా మారింది. 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉన్న ఆ జట్టుకు ఇప్పుడు హ్యాట్రిక్ ఓటముల సెగ తగిలింది. కోల్‌కతా, హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమితో రన్‌రేట్ బాగా పడిపోయింది. మూడో స్థానానికి చేరుకుంది. ఇక దానికి మిగిలింది రెండే మ్యాచులు. ఒకటి ముంబయి, రెండోది బెంగళూరు. ఈ రెండింట్లో గెలిస్తే 18 పాయింట్లతో టాప్-2లో ఉంటుంది. ఏదో ఒకటి గెలిస్తే మూడో స్థానంలోనైనా నిలుస్తుంది. రెండింట్లో ఓడిపోతే మాత్రం నెట్ రన్‌రేట్‌తో గట్టెక్కాల్సిన పరిస్థితి రావొచ్చు. ప్రస్తుతానికైతే ఢోకా లేదని చెప్పొచ్చు.