అబుదాబి వేదికగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరును ఇంటికి పంపి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తమ విజయంలో కీలక పాత్ర పోషించిన హోల్డర్, విలియమ్సన్, నటరాజన్‌లపై ప్రశంసల జల్లులు కురిపించాడు హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్. దిల్లీతో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ కోసం ఆత్రుతతో ఉన్నామని చెప్పాడు.
"సందీప్ శర్మ, హోల్డర్‌ను తొలి ఐదు ఓవర్లలో బౌలింగ్‌కు దింపాలనుకున్నాం. తర్వాత రషీద్, నటరాజన్‌కు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. రషీద్ ఖాన్ మీద చాలా ఒత్తిడి ఉంది. నటరాజన్ అదరగొట్టాడు. పరుగులు సాధించడంలో కేన్ కీలకంగా నిలిచాడు. ఒత్తిడితో కూడిన ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆడాడు. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు చాలా చక్కగా రాణించారు. మేము ఇంకా దిల్లీతో ఆడాల్సి ఉంది. ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్న ఆ జట్టుపై ఆడడానికి చాలా ఆత్రుతతో ఉన్నాం."
-- డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్.
ఒత్తిడికి గురిచేశారు..
హైదరాబాద్ జట్టు సమష్టి ప్రదర్శనతో తమను ఒత్తిడికి గురి చేసిందని అన్నాడు బెంగళూరు సారథి కోహ్లీ. సెకండ్ హాఫ్‌లో తాము తగినట్టుగా ప్రదర్శన చేయలేకపోయామని అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీజన్లో కీలకంగా నిలిచిన దేవ్‌దత్ పడిక్కల్‌ను కోహ్లీ అభినందించాడు.