ఎదురుగా కొండంత లక్ష్యం.. అంతగా అనుభవం లేని ఓ కుర్రాడు క్రీజులోకి వచ్చాడు. ఒత్తిడితో బంతికి బ్యాట్‌ను కూడా తాకించలేక అవస్థలు పడ్డాడు. అందరి దృష్టిలో విలన్‌గా మారిపోయాడు. హిట్టర్ ఉతప్పను కాదని అతడిని ముందుగా బ్యాటింగ్‌కు పంపించిన స్మిత్ నిర్ణయంపై అభిమానులంతా అసహనానికి గురయ్యారు. అయితే అదంతా కొద్దిసేపే. తర్వాతే అసలు కథ మొదలైంది. వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. అతడి విధ్వంసం చూసి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అంతే.. ఒక్కసారిగా విలన్ హీరోగా మారిపోయాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాతియా.
తొలుత 19 బంతుల్లో 8 పరుగులు చేసిన తెవాతియా తర్వాతి 12 బంతుల్లో 45 పరుగులు బాదేశాడు. పంజాబ్ బౌలర్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా అయిదు సిక్సర్లు బాదాడు. అప్పటివరకు స్ట్రైక్‌రొటేట్ చేయడం కోసం శ్రమించిన అతడు తర్వాత విధ్వంసమే సృష్టించి జట్టును గెలిపించాడు. దీంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం అతడి గురించి మాట్లాడటం ప్రారంభించింది. సూపర్ హిట్టింగ్‌తో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయిన రాహుల్ తెవాతియా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!
కుస్తీ అన్నారు.. హాకీ అన్నారు!
రాహుల్ తెవాతియాది హరియాణాలోని ఫరిదాబాద్ జిల్లాలోని సిహి అనే గ్రామం. అతడి తండ్రి కృషన్ పాల్ లాయర్‌గా పనిచేస్తున్నారు. అయితే తెవాతియా ఆటల్లోకి రావడానికి ప్రధాన కారణం తన తాతయ్య, మామయ్య. అతడి తాతయ్య వ్యవసాయంతో పాటు కుస్తీల్లో పాల్గొనేవారు. దీంతో మనవడ్ని పహిల్వాన్ చేయాలనుకున్నాడు. మరోవైపు అతడి మామయ్య హాకీ ప్లేయర్, దీంతో అల్లుడ్ని హాకీ ఆడించాలనుకున్నాడు. కానీ తెవాతియా మాత్రం క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులో అతడిని కృషన్ పాల్.. విజయ్ యాదవ్ క్రికెట్ అకాడమీలో చేర్చారు. విజయ్ యాదవ్ దగ్గరే తెవాతియా క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. భారత మాజీ వికెట్‌కీపర్ విజయ్ యాదవ్ క్రికెట్ అభిమానులకి సుపరిచితమే.