యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-ట్వంటీ లీగ్‌లో మంగళవారం హైదరాబాద్, చెన్నై జట్లు తలపడ్డాయి. చెన్నై నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో హైదరాబాద్ 147 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదింటిలో ఓడిన హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ ఆశలు సన్నగిల్లాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హైదరాబాద్ జట్టు సారథి వార్నర్ తమకు మరో పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్ అవసరం ఉందని అన్నారు. బౌలింగ్ విభాగంలో ప్రదర్శన బాగున్నప్పటికీ బ్యాటింగ్‌లో వైఫల్యాల కారణంగా జట్టు ఓటమి పాలవుతున్నట్లు తెలిపారు. తమ జట్టు లోపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివరించారు.
'మాకు ఇంకో బ్యాట్స్‌మెన్ అవసరం' - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో బ్యాట్స్‌మన్ అవసరం
ఐపీఎల్ టీ-ట్వంటీ లీగ్‌లో హైదరాబాద్ జట్టు పరాజయాలపై స్పందించారు సారథి వార్నర్. బౌలింగ్‌లో తాము బలంగా ఉన్నా.. బ్యాటింగ్‌లో వైఫల్యం చెందుతున్నట్లు తెలిపారు. తమ జట్టుకు ఇంకో బ్యాట్స్‌మెన్ అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ పిచ్‌పై 160 పరుగుల వరకూ ఛేదించవచ్చని అనుకున్నానని వార్నర్ అన్నారు. అంతకంటే ఎక్కువ పరుగులను రాబట్టడం కష్టమైందని పేర్కొన్నారు. జట్టులో ఏడుగురు బౌలర్లు ఉంటే ఎప్పుడూ మేలు చేస్తుందని చెన్నై జట్టును ఉద్దేశిస్తూ వార్నర్ మాట్లాడారు. బౌలర్లు రెండు వైపులా స్వింగ్ చేస్తున్నప్పుడు పవర్‌ప్లేలో పరుగులు చేయటం కష్టమని వివరించారు. హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మెన్లు విలియమ్సన్, బెయిర్ స్టో మినహా మిగతావారు రాణించకపోవటంతో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ జట్టు ఆదివారం అబుదాబిలో కోల్‌కతాతో తలపడనుంది.