హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మన్ ముజీబ్ ఉర్ రహమాన్(1) విచిత్రంగా ఔటయ్యాడు. థర్డ్ అంపైర్ ఔటిచ్చినా అతడు మళ్లీ రివ్యూకు వెళ్లి ఔటయ్యాడు. దీంతో ఒకే బంతికి రెండుసార్లు సమీక్షకు వెళ్లినట్లు అయింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్.. 115 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఆ క్రమంలోనే పూరన్(77)తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న ముజీబ్.. 14వ ఓవర్‌లో కీపర్ బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. ఆ బంతి బ్యాట్‌కు తాకిందా లేదా అనే అనుమానమే ఈ విచిత్ర ఘటనకు కారణమైంది.
ఒకే బంతికి రెండుసార్లు సమీక్ష.. అయినా సరే ఔట్ - kxip vs srh
హైదరాబాద్-పంజాబ్ మ్యాచ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఒకే బంతికి రెండుసార్లు సమీక్ష కోరగా, అందులో ఔట్‌గా తేలాడు ముజీబ్ ఉర్ రహమన్. ఈ మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.
ఖలీల్ అహ్మద్ వేసిన ఆ ఓవర్‌లో పూరన్ తొలుత రెండు ఫోర్లు, ఒక సింగిల్ తీసి ముజీబ్‌కు బ్యాటింగ్ ఇచ్చాడు. అతడు ఐదో బంతి ఆడగా అది శబ్దం చేస్తూ వెళ్లి నేరుగా కీపర్ చేతుల్లో పడింది. హైదరాబాద్ టీమ్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ స్పష్టత కోసం థర్డ్ అంపైర్‌కు నివేదించాడు. అప్పుడు ముజీబ్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఈ పంజాబ్ బ్యాట్స్‌మన్ మైదానం వీడుతుండగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎవరో రివ్యూకు వెళ్లమని చెప్పారు. ముజీబ్ సమీక్ష కోరగా ఈసారి మళ్లీ పరిశీలించారు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకినట్లు అనిపించడం వల్ల గత నిర్ణయాన్ని సమర్థించారు. దీంతో పంజాబ్ రివ్యూను వృథా చేసుకుంది. ఆ తర్వాత పూరన్ కూడా ఔటవ్వడం వల్ల పంజాబ్ 132 పరుగులకే ఆలౌటైంది.
ఈ సీజన్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడగా కేఎల్ రాహుల్ టీమ్ 5 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.