తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: మురిసిన ముంబయి.. ఐదో టైటిల్ కైవసం

ఐపీఎల్​ చరిత్రలో ముంబయి ఇండియన్స్​ ఆరుసార్లు తుదిపోరుకు చేరగా అందులో ఐదుసార్లు విజేతగా నిలిచింది. యూఏఈ వేదికగా నిర్వహించిన 13వ సీజన్​లోనూ అదరగొట్టి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో టోర్నీ చరిత్రలో రోహిత్​ సేన విజేతగా నిలిచిన సందర్భాలను గుర్తు చేసుకుందాం.

ipl 2020: reliving all IPL finals won by the mumbai indians
ఐపీఎల్​: ముంబయి ఇండియన్స్​ విజేతగా నిలిచిన క్షణాలు

By

Published : Nov 11, 2020, 12:02 AM IST

అభిమానులను ఉర్రూతలూగిస్తూ ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెట్టి మజానందించిన ఐపీఎల్ 13వ సీజన్ ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్​పై విజయంతో ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ముంబయి ఇండియన్స్. ఫలితంగా మరే జట్టుకు లేని తిరుగులేని రికార్డుల్ని ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్​లో క్వాలిఫయర్-1 మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై విజయంతో రోహిత్​సేన ఫైనల్​ పోరుకు అర్హత సాధించింది.

క్వాలిఫయిర్​-2లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై దిల్లీ క్యాపిటల్స్​ గెలుపొందడం వల్ల శ్రేయస్​ సేన తొలిసారి ఫైనల్​లో అడుగుపెట్టింది. తుదిపోరులో శ్రేయస్​ సేనపై ఐదు వికెట్ల తేడాతో ముంబయి ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐపీఎల్​ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ముంబయి ఫైనల్​లో విజేతగా నిలిచిన మ్యాచ్​లను గుర్తు చేసుకుందాం.

సీఎస్కేతో ఫైనల్ (2013)

​ఇది సచిన్​ తెందూల్కర్​ చివరి ఐపీఎల్​ సీజన్​. 2010లో ముంబయి ఇండియన్స్​ తొలిసారి ఐపీఎల్​ ఫైనల్​లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ గెలవలేకపోయింది. 2013 సీజన్​ మధ్యలో యువ క్రికెటర్​ రోహిత్​ శర్మ కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత ఫైనల్​లో చెన్నై సూపర్​కింగ్స్​పై విజయం సాధించి సచిన్​కు ఘన వీడ్కోలు పలికింది జట్టు.

ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 10 ఓవర్లలో 52/4తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అప్పుడు బరిలో దిగిన ఆల్​రౌండర్​​ పొలార్డ్​ తన విరోచిత పోరాటంతో ముంబయి స్కోరు బోర్డు 148/9కి చేర్చాడు. చెన్నై సూపర్​కింగ్స్ జట్టు టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ మంచి ఫామ్​లో ఉండటం వల్ల లసిత్​ మలింగ, మిచెల్​ జాన్సన్ల వంటి పేసర్లను బరిలో దించింది ముంబయి. ఫలితంగా సీఎస్కే 7 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 36 పరుగులు చేసింది. చెన్నై కెప్టెన్​ ధోనీ చివరి వరకు పోరాడినా.. 23 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్​ విజేతగా నిలిచింది.

సీఎస్కేతో రెండో ఫైనల్ (2015)

​ఐపీఎల్​-2015 సీజన్​ను ముంబయి ఇండియన్స్​ పేలవంగా ప్రారంభించింది. మొదటి 7 మ్యాచ్​ల్లో 5 ఓడి పాయింట్ల పట్టికలో చివరిస్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్​లలో ముంబయి తన అద్భుత పోరాటంతో పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరింది. దీంతో ఆ ఏడాది జరిగిన క్వాలిఫయర్​-1లో చెన్నైని ఓడించి ఫైనల్​కు దూసుకెళ్లింది.

క్వాలిఫయర్​-2 మ్యాచ్​లో సీఎస్కే గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది. ఈడెన్​ గార్డెన్​లో జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత ముంబయి బ్యాటింగ్​ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడంలో ముంబయి బౌలర్లు విజయం సాధించారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్​కింగ్స్​ 161 రన్స్​ చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ముంబయి ఇండియన్స్​ ఐపీఎల్​లో రెండోసారి విజేతగా నిలిచింది.

రైజింగ్​ పుణెతో ఫైనల్ (2017)

​ఈ సీజన్​లో ముంబయి ఇండియన్స్​ లీగ్​ దశ నుంచే అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయిర్​-1లో రైజింగ్​ పుణె సూపర్​జెయింట్స్​ చేతిలో పరాజయం చవిచూసిన తర్వాత.. క్వాలిఫయిర్​-2లో కోల్​కతా నైట్​రైడర్స్​ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది.

ఫైనల్లో తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి ఇండియన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బ్యాటింగ్​కు దిగిన పుణె జట్టు కూడా బ్యాటింగ్​లో విఫలమైంది. పుణె బ్యాట్స్​మెన్​ను ముంబయి బౌలర్లు కట్టడి చేసి 20 ఓవర్లలో 128 పరుగులకే పరిమితం చేశారు. ఫలితంగా 1 పరుగు తేడాతో రోహిత్​ సేన గెలుపొంది మూడోసారి విజేతగా నిలిచింది.

సీఎస్కేతో ఫైనల్ (2019)

​ఈ సీజన్​ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్​ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్వాలిఫయర్​-1 మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​పై విజయం సాధించి ఫైనల్​లో అడుగుపెట్టింది. ఇందులో ఓడి క్వాలిఫయర్​-2కు చేరిన ధోనీసేన.. దిల్లీ క్యాపిటల్స్​పై విజయం సాధించి.. 8వ సారి ఐపీఎల్​ ఫైనల్ చేరింది. చెన్నై సూపర్​కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ మధ్య జరిగిన 4వ ఫైనల్​ మ్యాచ్​ ఇది.

హైదరాబాద్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి ఇండియన్స్​ జట్టుకు ఓపెనర్లు క్వింటన్​ డికాక్​, పొలార్డ్​ గొప్ప ఆరంభాన్నిచ్చారు. దీంతో రోహిత్​సేన నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​ చేసిన సీఎస్కే 1 పరుగు తేడాతో ముంబయిపై పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్​లో సీఎస్కే బ్యాట్స్​మన్​ షేన్​ వాట్సన్​ విరోచిత పోరాటం వృథా అయ్యింది. ఈ గెలుపుతో ముంబయి ఇండియన్స్​ నాలుగోసారి విజేతగా నిలిచింది.

దిల్లీ క్యాపిటల్స్​తో ఫైనల్​ (2020)

ఐపీఎల్​-13వ సీజన్​ను యూఏఈ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి నిర్వహించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బయో-బబుల్​ను ఏర్పాటు చేసి టోర్నీని జరిపారు. ముంబయి ఇండియన్స్​ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్​కింగ్స్​.. లీగ్​ దశలోనే వైదొలగింది. ఈ సీజన్​లో అనూహ్యాంగా దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ఫైనల్​లోకి ప్రవేశించింది. దిల్లీ జట్టు ఐపీఎల్​ ఫైనల్​కు చేరడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై ఐదు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్​ ఘనవిజయం సాధించి.. ఐదోసారి విజేతగా నిలిచింది. దిల్లీ విధించిన 157 పరుగుల లక్ష్య ఛేదనలో సారథి రోహిత్ 68 పరుగులతో జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు.

ABOUT THE AUTHOR

...view details