తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధర తక్కువ.. ఆడింది మాత్రం చాలా ఎక్కువ! - మయాంక్ అగర్వాల్

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో కొందరు ఆటగాళ్లు.. వాళ్లను కొనుగోలు ధర కంటే చాలారెట్లు న్యాయం చేశారు. తమ జట్టు సాధించిన విజయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఇంతకీ వాళ్లెవరు? వారి ధరెంత?

Players who performed well for their price worth
ధర తక్కువ.. ఆడింది మాత్రం చాలా ఎక్కువ!

By

Published : Nov 9, 2020, 11:40 AM IST

ఐపీఎల్​ ఆఖరి అంకానికి చేరింది. ప్లేఆఫ్స్‌తో సహా అన్ని మ్యాచ్‌లు పూర్తి చేసుకుని తుదిపోరుకు సిద్ధమైంది. యూఏఈ వేదికగా జరుగుతున్న క్రికెట్‌ సమరంలో కొందరు ఆటగాళ్లు తమ ప్రదర్శనతో మైమరపించినా మరికొందరు ఉసూరుమనిపించారు. కొందరు తీసుకునే సొమ్ముకు ఏ మాత్రం న్యాయం చేయకపోయినా మరికొందరు తక్కువ మొత్తంలోనే అద్భుతమనిపించారు. అలా ఈ లీగ్‌లో రూ.20 లక్షల నుంచి కోటి వరకు మాత్రమే ధర పలికి ఆకట్టుకున్న ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం..

ఈసారైనా సత్తా చాటాలనే మయాంక్‌..

దీర్ఘకాలంగా ఈ లీగ్‌ ఆడుతున్నా మయాంక్‌ అగర్వాల్‌ ఎప్పుడూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలనే ఉద్దేశంతో బరిలోకి దిగాడు. ఇదే విషయాన్ని సీజన్‌ ఆరంభానికి ముందే చెప్పాడు. అన్నట్లుగానే మయాంక్‌ 13వ సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన అతడు 11 మ్యాచ్‌ల్లో 424 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, రెండు అర్ధశతకాలున్నాయి. దీంతో రాహుల్‌ 670 తర్వాత ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరీ సీజన్‌లో మయాంక్‌ ధరెంతో తెలుసా? రూ.ఒక కోటి మాత్రమే.

మయాంక్ అగర్వాల్

హైదరాబాద్‌లో సత్తా చాటుతున్న నటరాజన్‌..

హైదరాబాద్‌ బౌలింగ్‌ యూనిట్‌లో రషీద్‌ఖాన్‌ పేరుమోసిన స్పిన్నర్‌. అతడు ప్రపంచ శ్రేణి టీ20 బౌలర్‌. ఏడాదికి ఈ లీగ్‌లో రూ.6కోట్లు ఆర్జిస్తున్నాడు. అయితే, అతడి తర్వాత అంతే అద్భుతంగా రాణిస్తున్న పేసర్‌ నటరాజన్‌. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ఇతగాడు 16 వికెట్లతో రాణిస్తున్నాడు. మరీ రషీద్‌తో పోలిస్తే నటరాజన్‌కు చెల్లించేది ఎంతో తెలుసా? రూ.40లక్షలు.

టి.నటరాజన్

వికెట్లు తీస్తున్నా ధర పెరగని చాహర్‌..

చెన్నై పేసర్‌గా గతేడాది 22 వికెట్లతో విశేషంగా రాణించిన దీపక్‌ చాహర్‌ ఈసారి కూడా ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేశాడు. అయితే, టోర్నీ ఆరంభానికి ముందే ఇతగాడు కరోనా బారిన పడ్డాడు. తొలి మ్యాచ్‌కు ముందు కోలుకొని తుదిజట్టులోకి వచ్చాడు. 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి ఈసారి చెన్నై తరఫున రెండో అత్యధిక వికెట్ల బౌలర్‌గా నిలిచాడు. కానీ, ఇతర యువ క్రికెటర్లతో పోలిస్తే చాహర్‌కు ఈ సీజన్‌లో దక్కేది చాలా తక్కువే. రూ.80 లక్షలు మాత్రమే తీసుకుంటున్నాడు. మరోవైపు ఈ సీజన్‌లోనే అరంగేట్రం చేసిన అండర్‌-19 ఆటగాళ్లు యశస్వి జైశ్వాల్‌ (2.4 కోట్లు), రవిబిష్ణోయ్(2 కోట్లు)‌, కార్తీక్‌ త్యాగి(1.3 కోట్లు) చాహర్‌ కన్నా ఎక్కువే పొందటం విశేషం.

దీపక్ చాహర్

లేట్‌గా చెలరేగినా లేటెస్ట్‌గా వచ్చిన రుతురాజ్‌..

దుబాయ్‌లో అడుగుపెట్టగానే కరోనా బారిన పడిన మరో చెన్నై క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌. ఈ చెన్నై బ్యాట్స్‌మన్‌కు తొలుత 3 అవకాశాలు వచ్చినా విఫలమయ్యాడు. కానీ, లీగ్‌ దశలో చెన్నై పూర్తిగా విఫలమయ్యాక మళ్లీ అవకాశాలు వచ్చాయి. దీంతో వరుసగా చివరి మూడు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలు బాది సత్తా చాటాడు. అలా చెన్నైకు ఘోర పరభావాలు తప్పించాడు. మొత్తం 6 మ్యాచ్‌లాడిన రుతురాజ్‌ 204 పరుగులు చేశాడు. ఇతగాడి ధర రూ.20 లక్షలే.

రుతురాజ్ గైక్వాడ్

నాలుగు సీజన్ల నుంచి ఆడుతున్నా మురుగన్‌ అంతే..

పంజాబ్‌ జట్టులో మయాంక్‌ తర్వాత తక్కువ ధరకే ఆకట్టుకున్న క్రికెటర్‌ మురుగన్‌ అశ్విన్‌. ఈ యువ స్పిన్నర్‌ 2016 నుంచి ఆడుతున్నా ధర మాత్రం రూ.20లక్షలే. నాలుగు సీజన్లలో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిన అతడు 25 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ సీజన్‌లో కెరీర్‌ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో రాణించాడు. దాంతో సీజన్‌ రెండో సగంలో పంజాబ్‌ విజయాల్లో తనవంతు సాయం చేశాడు.

మురుగన్ అశ్విన్

బెంగళూరుకు ఆరంభాలిచ్చిన పడిక్కల్‌..

దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఎంతో నైపుణ్యమున్న బెంగళూరు బ్యాట్స్‌మన్‌. గతేడాదే ఆ జట్టుకు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. ఈసారి ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. దాంతో తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. తర్వాత కూడా నాలుగు అర్ధశతకాలతో మెరిశాడు. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని 15 మ్యాచ్‌ల్లో 473 పరుగులు చేశాడు. దాంతో బెంగళూరు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, పడిక్కల్‌ తీసుకునేది మాత్రం రూ.20లక్షలే.

దేవ్​దత్ పడిక్కల్

క్రికెటర్లంతా భవిష్యత్‌లో మరిన్ని అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ లీగ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కాలని కష్టపడుతున్నారు. అందుకోసమే తాము తీసుకునేది తక్కువ సొమ్మే అయినా, ప్రతిభ ఆధారంగా ముందుకు సాగాలని చూస్తున్నారు. వచ్చే ఏడాదైనా వీళ్లకు కాసుల పంట పండి మరింత దూకుడుగా రాణించాలని ఆశిద్దాం.!

ABOUT THE AUTHOR

...view details