తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రేంజ్​ హిట్టింగ్​'తో ఐపీఎల్​లో​ కొత్త ట్రెండ్ - సంజూ శాంసన్​ వార్తలు

ఐపీఎల్​ ద్వారా కొత్త తరం ఆటగాళ్లు బయటకు వస్తున్నారు. బ్యాటింగ్​ తీరుతో పాటు కొత్త కొత్త షాట్లతో క్రికెట్​ అభిమానులను వీరు అలరిస్తున్నారు. క్రికెట్​లో హెలికాప్టర్​ షాట్​, దిల్​స్కూప్​ తర్వాత రేంజ్​ హిట్టింగ్​కు మంచి డిమాండ్​ ఏర్పడింది. ఈ రేంజ్​ హిట్టింగ్​ అంటే ఏంటో తెలుసుకుందామా.

IPL 2020: How range-hitting has changed the dynamics of Powerplay
ఐపీఎల్​లో​ కొత్త ట్రెండ్​.. రేంజ్​ హిట్టింగ్​కు డిమాండ్​

By

Published : Oct 17, 2020, 8:29 AM IST

ఏళ్లు గడుస్తున్న కొద్ది క్రికెట్లో బ్యాటింగ్​ ప్రమాణాలు మారుతున్నాయి. ముఖ్యంగా టీ20లు వచ్చాక బ్యాటింగ్​ విధానమే పూర్తిగా మారిపోయింది. బ్యాట్స్​మెన్​ ప్రధానంగా బాదుడు పైనే దృష్టి పెడుతున్నారు. కొత్త కొత్త షాట్లతో.. అబ్బురపరిచే బ్యాటింగ్ విన్యాసాలతో మైమరిపిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్​ వీటికి వేదికగా మారింది. ఈ లీగ్​లో హెలికాప్టర్ షాట్​ నుంచి దిల్​స్కూప్ వరకూ ఇలా ఎన్నో విన్నూత్న షాట్లు చూశాం. పవర్​ హిట్టింగ్​తో అలవోకగా సిక్సర్లు బాదుతుంటే ఆస్వాదించాం.

రేంజ్​ హిట్టింగ్ అంటే?

ఈసారి ఇంకో కొత్త షాట్​ అలరిస్తోంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. బంతికి కళ్లకు మధ్య చక్కని సమన్వయంతో.. బ్యాట్​ స్వింగ్​ను ఉపయోగించుకుని బంతిని కచ్చితంగా స్టాండ్స్​లో పడేసే కొత్త హిట్టింగ్​ ఈ సీజన్​లో కనిపిస్తోంది. అదే రేంజ్​ హిట్టింగ్​. పవర్​ప్లేలో ఎక్కువ పరుగులు చేయడానికి అదే కారణమవుతోంది. అసలు ఈ రేంజ్​ హిట్టింగ్​ అంటే ఏమిటంటే.. బ్యాట్స్​మన్​ తన పూర్తి సామర్థ్యాన్ని వాడుకుని, ఒక కొలమానం ప్రకారం తన శక్తితో బంతిని బౌండరీ బయటకు పంపించడమే. అంటే దృష్టిని పూర్తిగా బంతిపై నిలిపి.. తలను దానికి నేరుగా పెట్టి.. బంతిని సరిగా అంచనా వేసి.. ఫ్రంట్​​ ఫుట్​ను ముందుకు పెట్టి.. బ్యాట్​ను వెనక్కిలాగి.. వీలైనంత పైకి తీసుకెళ్లి.. ఒక్కసారిగా బలంగా బ్యాట్​ను ముందుకు తెస్తూ బంతిని బాదడమే రేంజ్​ హిట్టింగ్​.

బేస్​బాల్​ టెక్నిక్​తో

ఇలా కొట్టే షాట్లు స్టాండ్స్​లో పడడం ఖాయం. చాలా మంది బ్యాట్స్​మెన్​ సిక్సర్లు కొట్టాలని ప్రయత్నించి భారీ షాట్లు ఆడి బౌండరీ లైన్​ దగ్గర ఫీల్డర్ల చేతికి చిక్కుతుంటారు. వాళ్లు కొట్టిన బంతి ఆ బౌండరీ లైన్​ దాటకపోవడానికి కారణం రేంజ్​ హిట్టింగ్​ లేకపోవడమే. బేస్​బాల్​ టెక్నిక్​ కూడా రేంజ్​ హిట్టింగ్​ను సమర్థంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. ఈ టెక్నిక్​తో కొట్టడం వల్ల తొడల బరువు నుంచి వచ్చే శక్తి కారణంగా బంతి ఫ్లాట్​గా వెళ్లినప్పటికీ అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. ఈ తరహా షాట్లు ఆడటానికి బరువు ఉపయోగించుకోవడం, తలను బంతికి నేరుగా ఉండేట్లు పెట్టడం కీలకం.

రేంజ్​ హిట్టింగ్​కు డిమాండ్​

ఈ సీజన్​లో తన తొలి మ్యాచ్​లోనే సీఎస్కేపై 32 బంతుల్లో 9 సిక్సర్లతో 74 పరుగులు చేసిన రాజస్థాన్​ ఆటగాడు సంజూ శాంసన్​ ఆ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. "ఈ తరం ఆటలో రేంజ్​ హిట్టింగ్​కు బాగా డిమాండ్​ ఉంటోంది. ఈ లాక్​డౌన్​లో నేను దానిపైనే దృష్టిసారించా. ఆ సామర్థ్యాన్ని పెంచుకున్నట్లే అనిపిస్తోంది" అని చెప్పాడు. ఆ తర్వాత పంజాబ్​తో ఆడిన మ్యాచ్​లోనూ అతను 7 సిక్సర్లు కొట్టడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details