ఈ ఏడాది ఐపీఎల్ గురించి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. కరోనా నేపథ్యంలో విదేశంలో జరిగినా ఈ మెగా లీగ్ రసవత్తరంగా జరిగింది. అందుకే సోషల్ మీడియాలోనూ అభిమానులు బాగా ముచ్చట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో తమ ప్లాట్‌ఫాంలో ఎక్కువగా వచ్చిన ట్వీట్స్ ఆధారంగా కొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది ట్విట్టర్. వ్యక్తుల్లో కోహ్లీ, జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ గురించే ఎక్కువమంది మాట్లాడుకున్నట్లు తెలిపింది .
జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది ట్విట్టర్. ఈ జాబితాలో దిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
'గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్'
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోను దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ట్వీట్ చేసి.. పూరన్‌పై ప్రశంసలు కురిపించారు. దీనికి రెండు లక్షలకు పైగా లైక్స్, 23వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి. ఈ ట్వీట్‌ను 'గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది ట్విట్టర్.