కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఒక్క వికెట్ కూడా పడకుండా.. రెండు ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(63), పూరన్(33) రాణించారు. ఛేదనలో చెన్నై దూకుడుగా ఆడింది. ఓపెనర్లు డుప్లెసిస్(87*), వాట్సన్(83*) అదరగొట్టారు. దీంతో అలవోకగా విజయం సాధించింది. ఈ క్రమంలోనే లీగ్‌లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.
రాహుల్ ఘనతలు
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ కెరీర్లో 18 అర్ధశతకాలు చేశాడు. 44.68 సగటుతో.. 2,279 పరుగులతో ఉన్నాడు. ఈ సీజన్లో 300 పరుగుల మార్కును దాటేశాడు. సీఎస్కేపై ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆడి, 263 పరుగులు చేశాడు. లీగ్‌లో పంజాబ్ తరఫున 1,500 పరుగుల మార్కును అందుకున్నాడు.
ఓపెనర్లుగా అద్భుతం
ఈ ఏడాది కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుత ఆరంభాలు ఇస్తున్నారు. చెన్నైతో మ్యాచ్‌లో ఇద్దరూ నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేసి 30కి పైగా పరుగులు సాధించారు. ఐపీఎల్లో టీమ్ఇండియా క్రికెటర్ల ఓపెనింగ్ ఉత్తమ ద్వయంలో వీరు ఏడో స్థానంలో ఉన్నారు.