చెన్నై సూపర్‌కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంది. గతేడాది ఫైనల్లో ఓటమికి బదులిచ్చింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంబటి రాయుడు, డుప్లెసిస్ కీలకపాత్ర పోషించారు. ఇద్దరు తలో అర్ధ శతకం చేసి జట్టు బోణీ కొట్టేలా చేశారు.
163 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన చెన్నై.. ప్రారంభంలోనే ఓపెనర్లు వాట్సన్(4), మురళీ విజయ్(1) వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడు, డుప్లెసిస్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలో 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
71 పరుగులు చేసిన తర్వాత మూడో వికెట్‌గా రాయుడు వెనుదిరిగాడు. ముంబయి బౌలర్లు తలో వికెట్ తీసుకున్నారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్.. ఇన్నింగ్స్‌ను ఘనంగా మొదలుపెట్టింది. 4.4 ఓవర్లలోనే 46 పరుగులు చేసిన స్థితిలో ఓపెనర్ రోహిత్ శర్మ(12) ఔటయ్యాడు. వెంటనే డికాక్(33) కూడా పెవిలియన్ బాటపట్టాడు.
అనంతరం సూర్యకుమార్ యాదవ్(17), సౌరభ్ తివారీ (42), హార్దిక్ పాండ్య(14), పొలార్డ్(18), కృనాల్ (3), జేమ్స్ ప్యాటిన్సన్(11).. ఓ మాదిరి స్కోరు మాత్రమే చేశారు. చెన్నై బౌలర్లలో ఎంగిడి 3, జడేజా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు, శామ్ కరన్, చావ్లా ఒక్కో వికెట్ తీశారు.