డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి విజయ పరంపర కొనసాగిస్తోంది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన 111 పరుగుల లక్ష్యాన్ని 14.2 ఓవర్లలో ఛేదించింది. ఇషాన్ కిషాన్ (72 నాటౌట్) అజేయ అర్థశతకంతో చెలరేగి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దిల్లీ జట్టుపై ముంబయి ఘన విజయం - Mumbai Indians
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీపై ముంబయి గెలిచింది. దీంతో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాల్ని మరింత సంక్లిష్టం చేసుకుంది దిల్లీ.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఓపెనర్లు ఇషాన్, డికాక్ (26) దిల్లీకి అవకాశం ఇవ్వలేదు. తొలుత వికెట్ పడకుండా నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత దూకుడు పెంచింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 10 ఓవర్లలో ముంబయి 68 పరుగులు చేసింది. అయితే డికాక్‌ను నోర్జె ఔట్ చేసి, దిల్లీకి కాస్త ఊరట కలిగించాడు. కానీ ఇషాన్ మరింత చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ (12*)తో కలిసి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో అర్థశతకం చేశాడు. నోర్జె బౌలింగ్‌లో సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీని బౌల్ట్ దెబ్బతీశాడు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (0), పృథ్వీ షా (10)ను 15 పరుగులకే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన పంత్ (21)తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ రాహుల్ చాహర్.. శ్రేయస్‌ను బోల్తాకొట్టించాడు. అనంతరం బుమ్రా ధాటికి దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను విలవిలలాడారు. 12వ ఓవర్‌లో స్టాయినిస్ (2), పంత్‌ను ఔట్ చేసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. అతడికి ఇతర బౌలర్లు కూడా సహకరించకపోవడం వల్ల దిల్లీ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దిల్లీ బ్యాట్స్‌మెన్‌లో రబాడ (12) రవిచంద్రన్ అశ్విన్ (12) హెట్‌మైయర్ (11), ప్రవీణ్ దూబె (7 నాటౌట్), హర్షల్ పటేల్ (5) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బుమ్రా, బౌల్ట్ చెరో మూడు, కౌల్టర్ నైల్, రాహుల్ చాహర్ చెరో ఒక్క వికెట్ తీశారు.