అబుదాబి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా.. లీగు దశ నుంచే ధోనీసేన వైదొలగింది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే లీగ్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే తొలిసారి. దీనిపై మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో ధోనీ స్పందించాడు. జట్టును కొత్త తరానికి అప్పగించే సమయం వచ్చిందని వెల్లడించాడు. ఆలస్యంగా జట్టులో చేరిన రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు.
"మా జట్టుకు ఇది చాలా కష్టమైన సీజన్. జట్టులో చాలా లోపాలు ఉన్నాయి. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మా జట్టు చాలా బాగా రాణించింది. యువ ఆటగాళ్ల ప్రదర్శన గర్వంగా ఉంది. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ వేలం ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియదు. ముందుగా జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మా ఆటగాళ్లందరూ సహకరించారు. ఇప్పుడు యువతరానికి జట్టును అప్పగించాలి. వచ్చే సీజన్ కోసం బలంగా తిరిగి వస్తాం. రుతురాజ్ బ్యాటింగ్‌ను చూశాం. నెట్ సెషన్స్‌లోనూ బాగా రాణించాడు. కానీ, మేము అతడి ఆటను చాలా మిస్ అయ్యాం. కొవిడ్ కారణంగా 20 రోజుల పాటు అతడు ఫిట్‌గా లేడు."