ఐపీఎల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్‌ను, అత్యధిక వికెట్స్ సాధించిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్‌ను ప్రదానం చేయడం ఆనవాయితీ. టోర్నీ ప్రారంభంలో ఆరెంజ్ క్యాప్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సాధించగా.. ప్రస్తుతం అదే జట్టులోని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆ టోపీని సొంతం చేసుకున్నాడు. పర్పుల్ క్యాప్ కూడా ఇదే జట్టుకు చెందిన షమీ దగ్గర ఉండటం విశేషం.
ఒకే జట్టు బ్యాట్స్‌మెన్ పోటీ
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 18 బంతుల్లో 25 పరుగులు రాబట్టాడు. దీంతో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 246 రన్స్‌తో మయాంక్ అగ్రస్థానానికి చేరుకుని ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. 239 పరుగులతో రెండో స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. మూడో స్థానంలో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ (మూడు మ్యాచ్‌ల్లో 173 పరుగులు) నిలిచాడు.