ఈ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ వైఫల్యం చెందడం గురించి దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా మాట్లాడాడు. జట్టులోని యువ క్రికెటర్లకు సరైన అవకాశాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. వీటన్నింటిని మర్చిపోయి వచ్చే ఏడాది తిరిగి పుంజుకోవాలని సీఎస్కేకు సూచించాడు.
"చెన్నై సూపర్‌కింగ్స్‌లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారి బ్యాటింగ్ లైనప్‌లో యువ క్రికెటర్లు ఎవరూ లేరు. ఈ సీజన్లో యువత కంటే సీనియర్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం సీజన్ నాకైతే నమ్మశక్యం కావడం లేదు. ధోనీసేన తిరిగి పుంజుకుంటుందని మేం ఎంతో ఆశగా ఎదురుచూశాం. కానీ అది జరగలేదు. రానున్న ఏడాదైనా చెన్నై మెరుగ్గా రాణిస్తుందని అనుకుంటున్నాను. మిగిలిన మ్యాచ్‌ల్లో యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చి వారేమి చేయగలరో చూడండి"