ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కోసం క్రికెట్ అభిమానులే కాకుండా బెట్టింగ్ బుకీలూ ఆసక్తిగా ఎదురుచూస్తారని అంటున్నారు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి అజిత్ సింగ్. అందువల్ల ప్రస్తుత సీజన్లో బుకీలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. టోర్నీలో బెట్టింగ్ కార్యకలాపాలు జరగకుండా యూఏఈ క్రికెట్ బోర్డు, స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"కొంతమంది బుకీలు దుబాయ్‌కి చేరుకున్నారు. కానీ, వారు ఇంకా లీగ్‌పై ప్రభావం చూపించలేదు. బయో బబుల్‌లోని ప్రతి కదలికను తెలుసుకోవడానికి మూడు వేదికల చుట్టూ మూడు వేర్వేరు బృందాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి చర్యలను నిర్మూలించడానికి ప్రత్యేక నిఘా ఉంచాం. దీని కోసం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో పాటు స్థానిక పోలీసులు మాకు సహకారాన్ని అందిస్తున్నారు. భారత్ వేదికగా గతంలో జరిగిన కొన్ని బెట్టింగ్ కార్యకలాపాలను ట్రాక్ చేసిన పోలీసుల నివేదికలను ఇందుకోసం పరిశీలిస్తున్నాం."
- అజిత్ సింగ్, బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి