ఐపీఎల్ ప్రారంభమై ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఈ ఏడాది లీగ్.. గాయాల ప్రీమియర్ లీగ్‌గా పేరు తెచ్చుకుంటోంది. టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి చాలామంది ఆటగాళ్లు ఫిట్నెస్ లేకపోవడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. మరికొందరు గాయాల కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యారు. మిచెల్ మార్ష్‌తో మొదలైన గాయాల పరంపర.. చెన్నై, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ వరకు సాగి క్రమంగా పెరిగిపోతోంది.
19వ ఓవర్ బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్.. తొడభాగం గాయపడటం వల్ల ఓవర్ మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. మొదట నొప్పి వచ్చినప్పుడు వైద్యుడి సాయంతో కాస్త కోలుకున్నట్లు కనిపించాడు. తిరిగి బౌలింగ్ వేసేందుకు ప్రయత్నించగా మళ్లీ నొప్పి మొదలవ్వడం వల్ల మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ మిగిలిన ఓవర్‌ను పూర్తిచేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.. ఫిజియోతో మాట్లాడితే కానీ, భువీ పరిస్థితి ఏంటో తెలియదని, పూర్తి సమాచారం తెలుసుకున్నాకే సమాధానమిస్తానని పేర్కొన్నాడు.