తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇకపై మరిన్ని మంచి మ్యాచ్​లు చూస్తాం: గంగూలీ - ఐపీఎల్ గురించి గంగూలీ

ప్రస్తుతం ఐపీఎల్ మజా ఆస్వాదిస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్​లు ఉత్కంఠభరితంగా సాగాయి. అయితే ఇకముందు కూడా ఎన్నో ఆసక్తికర మ్యాచ్​లు చూస్తామని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.

Hopes more good matches in mens and womens IPL says Sourav Ganguly
ఇకపై మరిన్ని మంచి మ్యాచ్​లు చూస్తాం: గంగూలీ

By

Published : Sep 22, 2020, 6:33 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఐపీఎల్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని, మున్ముందు మరిన్ని ఆసక్తికర మ్యాచ్‌లు చూస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న లీగ్ సహా నవంబర్‌ 1వ తేదీ నుంచి మొదలు కానున్న మహిళల టీ20 ఛాలెంజ్‌ టోర్నీలో మరిన్ని ఉత్కంఠభరిత మ్యాచ్‌లు ఉంటాయని పేర్కొన్నాడు.

"ఇప్పటికి మూడు మంచి మ్యాచ్‌లు చూశాం. రానున్న 60 రోజుల్లో పురుషులు సహా మహిళల క్రికెట్‌ పోటీల్లో అనేక ఆసక్తికర మ్యాచ్‌లు చూడబోతున్నాం."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ప్రస్తుతం దుబాయ్‌లో నిర్వహిస్తున్న పొట్టి క్రికెట్‌ పోటీల్లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్‌ 19న చెన్నై-ముంబయి జట్ల మధ్య జరిగిన మొదటి పోరులో చెన్నై 5 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించింది. భారీ అంచనాలు లేని దిల్లీ-పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోరు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు చేసి గెలుపొందాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ అనూహ్యంగా చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా మిగిలి, సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. ఆ సూపర్‌ ఓవర్‌లో దిల్లీ విజేతగా నిలిచింది.

ఇక హైదరాబాద్‌-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా ఆసక్తిగానే సాగింది. గెలుపు ముంగిట నిలిచిన హైదరాబాద్‌ చివర్లో బోర్లాపడింది. బౌలింగ్‌లో మొదట తడబడి చివర్లో పుంజుకుని ప్రత్యర్థిని 163 స్కోరుకే పరిమితం చేసిన హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్‌ జోరు చూస్తే గెలిచేలా కనిపించింది. కానీ చివర్లో వికెట్లు చేజార్చుకొని ఓటమి చవిచూసింది.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details