పంజాబ్‌పై క్రిస్‌గేల్ సిక్సర్ల తాండవం చేస్తే.. ముంబయి ఓపెనర్ క్రిస్‌లిన్ రాజస్థాన్‌కు మెరుపు ఆరంభం ఇస్తే.. ఇమ్రాన్ తాహిర్ చెన్నై నుంచి పంజాబ్‌కు మారథాన్ చేస్తే? అన్నింట్లోనూ ఒక పోలిక ఉంది. అది ఏంటో కనిపెట్టారా? వాళ్లు వాళ్ల సొంత జట్లకు ప్రత్యర్థులుగా మారనున్నారు. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. నిజమే. అచ్చంగా పైన చెప్పినట్లే కాకపోయినా.. చాలా మంది టీ20 స్పెషలిస్టులు తమ జెర్సీలు మార్చుకోనున్నారు. సొంత జట్లకే ప్రత్యర్థులుగా మారనున్నారు. మిడ్‌సీజన్ బదిలీల పేరుతో బీసీసీఐ ఆయా జట్లకు ఆటగాళ్ల మార్పిడి అవకాశం కల్పించనుంది.
అసలేంటీ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్?
ఆయా ఫ్రాంచైజీలు ప్రత్యర్థి జట్లలో నచ్చిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చు. అవసరం లేదనుకున్న ఆటగాళ్లను తమ జట్టు నుంచి వదులుకోవచ్చు. ఇదే ఈ ప్రక్రియ సారాంశం. గతంలో ఇలాంటి ప్రక్రియ చేపట్టినప్పటికీ అప్పటి నిబంధనల వల్ల అది సత్ఫలితం చూపించలేకపోయింది. ఒక్కమ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్లనే బదిలీలకు అనుమతించడం వల్ల ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ, ఇప్పుడు మ్యాచ్‌లో ఆడని ఆటగాళ్లతో పాటు ఆడిన ఆటగాళ్లను కూడా బదిలీ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో ఆయా జట్లలో కీలక ఆటగాళ్లు ఇతర జట్లకు బదిలీ కానున్నారు.
ఎప్పుడు?
టీ20 లీగ్ 13వ సీజన్ దాదాపు సగం పూర్తి కావచ్చింది. ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు ఆయా జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్లకు బీసీసీఐ మంచి అవకాశం కల్పించనుంది. తమ జట్లలోని ఆటగాళ్లను మార్చుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ సోమవారం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో టోర్నీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌ల తర్వాత సీజన్ సగం పూర్తవుతుంది. అందుకే ఆ తర్వాతి రోజు ఈ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఎలా సాగుతుంది?
ఏదైనా జట్టు తమ జట్టులోని ఒక ఆటగాడిని బదిలీకి పెడుతున్నాం అని ప్రకటిస్తుంది. ఆ ఆటగాడిపై ఇతర జట్ల ఫ్రాంచైజీలకు ఆసక్తి ఉంటే అతడ్ని ఆ జట్టులోకి తీసుకుంటాయి. ఉదాహరణకు ముంబయి బ్యాటింగ్ లైనప్ ఇప్పటికే దృఢంగా ఉంది కాబట్టి క్రిస్‌లిన్‌ను వదులుకోవడానికి ముంబయి సిద్ధపడిందనుకోండి. బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా ఉన్న చెన్నై లిన్‌ను తమ జట్టులోకి తీసుకోవచ్చు. అలాగే బౌలింగ్‌లో రాణించలేకపోతున్న పంజాబ్.. ముంబయి బౌలర్ మిచెల్ మెక్‌క్లెనాఘన్‌ను తీసుకోవచ్చు. అయితే ఈసారి.. క్రిస్‌గేల్, క్రిస్‌లిన్, అజింక్యా రహానె, మిచెల్ శాంట్నర్, ఇమ్రాన్ తాహిర్‌పై ఇతర ఫ్రాంచైజీలు మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్ జట్టు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో భువీ స్థానాన్ని మరో మంచి బౌలర్‌తో భర్తీ చేయాలని హైదరాబాద్ కసరత్తు చేస్తోంది.
నిబంధనలు
- ఈ ప్రక్రియకు ముందు ప్రతి జట్టు ఏడు మ్యాచులు పూర్తి చేసుకొని ఉండాలి
- ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు మించి ఆడిన ఆటగాళ్లు ఇందుకు అనర్హులు
- కొత్త ధర ఉండదు. వేలం పాటలో వాళ్లకు దక్కిన ధర కొనసాగుతుంది
- విదేశీ ఆటగాళ్లతో పాటు భారత క్రికెటర్లు కూడా ఇందుకు అర్హులే.