సరిగ్గా నెలా నాలుగు రోజుల ముందు రాత్రి 7:29 గంటల నుంచీ దేశమంతా ఒక్కటే చర్చ. టీమ్ఇండియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన, 28 ఏళ్ల వన్డే ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన, టెస్టుల్లో అగ్రస్థానం సాధించిపెట్టిన మహేంద్రుడు ఇక జాతీయ జట్టుకు ఆడడు అన్న వార్త అతడి అభిమానులకు హార్ట్ బ్రేక్ అయితే... క్రికెట్ ప్రపంచానికే పెద్ద షాక్.
అప్పట్నుంచి తమ కెప్టెన్ కూల్‌ను మళ్లీ మైదానంలో చూసుకునేందుకు కళ్లలో వత్తులు వేసుకుని మరీ అభిమానులు ఐపీఎల్ కోసం ఎదురుచూశారు. యాద్ధృఛ్చికమో మారేంటో కానీ 7:29 గంటలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే 7:౩౦కి గ్లోవ్స్ వేసుకుని జట్టును మైదానంలోకి నడిపించాడు ధోనీ. స్టేడియంలో అభిమానులు ఉండుంటే వారి కేరింతలతో మోతెక్కిపోయేదేమో. కానీ ఆ అవకాశం లేక ఇంట్లోనే చూసుకుని మురిసిపోయారు.
టాస్ సమాయనికి ధోనీ గ్రౌండ్లోకి రాగానే... అభిమానుల అందరి భావన ఒక్కటే. లాక్డౌన్ లో మా ధోనీ భలే ఫిట్‌గా తయారయ్యాడని. సింగం సినిమాల్లో హీరో సూర్యలా గెడ్డం స్టైల్ కూడా మార్చాడే అనుకుని మురిసిపోయారు. తొలుత సీఎస్కే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, ధోనీ మెరుపు స్టంపింగ్స్ చూద్దామన్న వారి కోరిక తీరలేదు. సరేలే ఆ అవకాశం ఎక్కడా చిక్కలేదులే అనుకుని వికెట్ల వెనుక అందుకున్న రెండు చక్కని క్యాచ్‌లతో సరిపెట్టుకున్నారు.
ఐపీఎల్లో 100 విజయాలు నమోదు చేసిన ధోనీ చెన్నై ఛేజింగ్ అని తెలియగానే ధోనీ ఫినిషింగ్ షాట్ చూడచ్చన్న ఆశ వారిలో కలిగింది. కానీ ఆ అదృష్టం అలానే ఉండిపోయింది. ఛేదనలో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పుడు, 'మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది . కచ్చితంగా ధోనీ వచ్చి గెలిపిస్తాడు' అని అందరు భావించారు. కానీ రాయుడు, డుప్లెసిస్ చక్కని భాగస్వామ్యంతో మ్యాచ్ ను దాదాపుగా వన్ సైడ్ చేసేశారు. ఇక అభిమానులు మెల్లగా ఆశలు వదిలేసుకున్నారు. కానీ మ్యాచ్ మీద కాదు, ధోనీ క్రీజ్‌లోకి రావడంపై.
16వ ఓవర్లో రాయుడు ఔట్ అయ్యాక ధోనీ వస్తాడేమో అని చూశారు. జడేజా వచ్చాడు. నిరాశ! 18వ ఓవర్లో జడేజా ఔట్. 'ఇక చూసుకోండి. వచ్చేది మా ధోనీయే'. కానీ మళ్ళీ నిరాశే. సామ్ కరన్ వచ్చాడు. అతను త్వరగా విలువైన పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అప్పటికి తెర పడింది ధోనీ అభిమానుల 14 నెలల నిరీక్షణకు. క్రీజ్‌లోకి వచ్చాడు. గార్డ్ తీసుకున్నాడు. గ్లోవ్స్ సర్దుకుంటూ ఫీల్డింగ్‌ను పరికించాడు. హెల్మెట్ గ్రిల్ మధ్యలో నుంచి బొటన వేలితో చెమట తుడుచుకుని మొదటి బంతి ఎదురుకున్నాడు. బుమ్రా బౌన్సర్. బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ కీపర్ చేతుల్లో బంతి. ఫీల్డర్స్ అప్పీల్. అంపైర్ ఔట్ ఇచ్చాడు. 'ఇదేంటి ఇలా అయింది. 14 నెలలు చూస్తే మా ధోనీ గోల్డెన్ డక్ అయ్యాడా' చాలా మంది ఫీలింగ్ ఇదే. 'అక్కడ ఉన్నది మా ధోనీ' అని ఇంకొందరు అనుకున్నారు. అదే నిజమైంది. డీఆర్ఎస్ ( డెసిషన్ / ధోనీ రివ్యూ సిస్టం) ఉపయోగించి నాట్ ఔట్ గా తేలాడు. కానీ ఆ తర్వాత అతను పరుగులేమీ చేయకుండానే లక్ష్యం పూర్తయింది. ఆ నిరాశ మాత్రం ధోనీ అభిమానులకు మిగిలిపోయింది.
తన కన్నా ముందు కరన్‌ను పంపిన ధోనీ... ఆ నిర్ణయాన్ని మాస్టర్ స్ట్రోక్ అనిపించాడు. ఎడమచేతి బ్యాట్సమన్ అయిన కరన్... కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ఓ సిక్స్, ఫోర్ కొట్టడమే కాక బుమ్రా ఓవర్లోనూ సిక్స్ కొట్టి మ్యాచ్ చెన్నైదే అని ఖరారు చేయగలిగాడు. తర్వాత డుప్లెసిస్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ విధంగా మ్యాచ్ మొత్తం మీద ధోనీ అభిమానులకు ఆనందం, అసంతృప్తి రెండూ మిగిలాయి. కానీ ఇంకా కనీసం 13 మ్యాచ్‌లు ఉంటాయి. ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన ఘనమైన రికార్డు నిలబెట్టుకోగలిగితే... ఇంకా ఎక్కువ మ్యాచ్‌లే ఉన్నాయి ధోనీ మెరుపులు చూడటానికి.
ఈ ఆశతోనే 22వ తేదీ కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు చెన్నై రాజస్థాన్‌తో తలపడనుంది.