తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్​ విధ్వంసం.. చిత్తుగా ఓడిన చెన్నై - ఆర్సీబీ స్క్వాడ్ టుడే

దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​పై 37 పరుగుల తేడాతో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఆల్​రౌండ్​ ప్రదర్శనతో టోర్నీలో ఆర్సీబీ తన నాలుగో గెలుపును నమోదు చేసుకుంది.

CSK vs RCB: All-round Royal Challengers Bangalore beat Chennai Super Kings by 37 runs
రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

By

Published : Oct 10, 2020, 11:53 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​కు ఐపీఎల్​లో మరో పరాభవం ఎదురైంది. బెంగళూరు బౌలర్ల సమష్టి దెబ్బకి విలవిల్లాడింది. 170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 132/8కే పరిమితమైంది. ఏకంగా 37 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అంబటి రాయుడు (42), జగదీశన్‌ (33) మినహా మరెవ్వరూ రాణించలేదు. మరోవైపు కోహ్లీసేన నాలుగో విజయంతో 8 పాయింట్లతో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. ప్లేఆఫ్‌కు రేసులో నిలిచింది. అంతకు ముందు బెంగళూరులో విరాట్ కోహ్లీ (90*) దుమ్మురేపాడు.

విధ్వంసకర బ్యాటింగ్​

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న బెంగళూరును ధోనీసేన బౌలర్లు అదరగొడుతున్నా.. ఆరంభంలో పరుగులేమీ రాకున్నా.. విరాట్ కోహ్లీ (90*) ఒక్కడే విధ్వంసం సృష్టించాడు. మైదానంలో అద్భుతమైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగాడు. అతడికి తోడుగా శివమ్‌ దూబె (22*), దేవదత్‌ పడిక్కల్‌ (33) రాణించడం వల్ల ధోనీసేనకు బెంగళూరు 170 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

16 ఓవర్ల వరకు చెన్నై చేతిలోనే..

బెంగళూరు ఇన్నింగ్స్‌ తొలుత చప్పగా సాగింది. జట్టు స్కోరు 13 వద్దే దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో ఫించ్‌ (2) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసిరి బెంగళూరును కట్టడి చేశారు. ఎంతలా అంటే.. కోహ్లీ, దేవదత్‌ కేవలం సింగిల్స్‌కే పరిమితం అయ్యారు. దాంతో 10 ఓవర్లకు కోహ్లీసేన 65/1తో నిలిచింది. వీరిద్దరూ అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పాక ఆ జట్టుకు వరుస షాకులు తగిలాయి. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 12వ ఓవర్లో పడిక్కల్‌, ఏబీ డివిలియర్స్‌ (0)ను వెంటవెంటనే ఔటయ్యారు. మరికాసేపటికే ఓ సిక్సర్‌ బాదిన వాషింగ్టన్‌ సుందర్‌ (10)ను 14.3వ బంతికి కరన్‌ పెవిలియన్‌కు పంపించడం వల్ల 16 ఓవర్లకు బెంగళూరు 103/4తో నిలిచింది.

5 ఓవర్లు.. 46 పరుగులు

చెన్నై బౌలర్ల ప్రతాపం చూస్తుంటే బెంగళూరు 140 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే 17వ ఓవర్లో బౌండరీతో అర్ధశతకం అందుకున్న కోహ్లీ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. తనలోని వినూత్న షాట్లనూ బయటకు తీశాడు. ఆఫ్‌సైడ్‌కు జరిగి లెగ్‌సైడ్‌లో బౌండరీ బాదాడు. దూబెతో కలిసి కళ్లు చెదిరే సిక్సర్లు.. సొగసైన బౌండరీలు దంచాడు. వీరిద్దరూ 18వ ఓవర్లో 24, 19వ ఓవర్లో 14, 20 ఓవర్లలో 14 చొప్పున పరుగులు చేశారు. దాంతో బెంగళూరు స్కోరు 169/4కి చేరుకుంది. ఈ జోడీ చివరి 5 ఓవర్లలో 74 పరుగులు రాబట్టడం విశేషం. చెన్నైలో శార్దూల్‌ ఠాకూర్‌ 2, కరన్‌, చాహర్‌ తలో వికెట్‌ తీశారు.

ABOUT THE AUTHOR

...view details