తెలంగాణ

telangana

ETV Bharat / sports

రుతురాజ్​ భళా.. చెన్నై సూపర్​కింగ్స్​దే విజయం - Chennai Super Kings beat Kolkata Knight Riders

దుబాయ్​ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​పై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్​కింగ్స్​ విజయం సాధించింది. దీంతో టోర్నీలో ఐదో గెలుపును ధోనీసేన తమ ఖాతాలో వేసుకుంది.

CSK vs KKR: Chennai Super Kings beat Kolkata Knight Riders
రుతురాజ్​ భళా.. చెన్నై సూపర్​కింగ్స్​దే విజయం

By

Published : Oct 29, 2020, 11:49 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్‌లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో కోల్​కతాపై చెన్నై విజయం సాధించింది. చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా క్రీజులో ఉన్న జడేజా ఆఖరి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే.
173 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన చెన్నై జట్టు ఓపెనర్లు వాట్సన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మంచి ఆరంభాన్నిచ్చారు. భాగస్వామ్యం 50 పరుగులు పూర్తి చేశాక.. వాట్సన్‌ (14) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కోల్‌కతా స్పిన్నర్‌ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రింకూ చేతికి చిక్కి వాట్సన్​ ఔటయ్యాడు. మరో ఎండ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు ఎడాపెడా బౌండరీలు బాదాడు.

పదో ఓవర్‌ వేసిన రాణా బౌలింగ్‌లో రాయుడు హ్యాట్రిక్‌ బౌండరీలు బాదాడు. తర్వాత ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో యువ బ్యాట్స్‌మన్‌ గైక్వాడ్‌ ఫోర్‌.. సిక్సర్‌ బాది అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న రాయుడు (38) వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్‌ బౌలింగ్‌లో నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చి ధోనీని చక్రవర్తి బోల్తా కొట్టించాడు. బంతిని సరిగా అంచనావేయలేకపోయిన ధోనీ 1(4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. చెన్నై విజయానికి 15 బంతుల్లో 33 పరుగులు అవసరమైన సమయంలో గైక్వాడ్‌ (72) ఔటయ్యాడు. ఆఖర్లో జడేజా (31) ఎప్పటిలాగే మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.
టాస్‌ గెలిచిన చెన్నై ప్రత్యర్థి కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పవర్‌ప్లేలో విఫలమవుతూ వస్తున్న కోల్‌కతాకు ఈసారి మంచి ఆరంభమే లభించింది. గిల్‌, రాణా కలిసి ఈ సీజన్‌లో తొలిసారిగి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల కోల్‌కతా వేగంగా పరుగులు చేయలేకపోయింది. గిల్‌ (26), కార్తిక్‌ (21) పర్వాలేదనిపించారు. ఆ తర్వాత వచ్చిన నరైన్‌ (7), రింకూ సింగ్‌ (11) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. వరుసగా వికెట్లు పడుతున్నా రాణా మాత్రం స్కోరు బోర్డును పరుగులు పెట్టించి.. 87 (61, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీశాడు. కర్ణ్​ శర్మ, జడేజా, శాంట్నర్‌ ఒక్కో వికెట్‌ సొంతం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details